"చాలా సేపట్నుంచీ చూస్తున్నాను. అతను - ఆ పక్కకూ, ఈ పక్కకూ తిరుగుతున్నాడు. పైకీ కిందికీ గెంతుతున్నాడు. ఎవరన్నా తరుముతున్నారేమో, ప్రాణభయంతో అలా చేస్తున్నాడనుకోడానికయినా, ఇక్కడెవ్వరూ లేరు. పోనీ - పిచ్చివాడనుకొందామన్నా, అలా కనిపించడం లేదు. అవును గదూ?" అన్నదో పూవు అతని వేపే చూస్తూ. "అతన్నెవరూ తరమడం లేదు. అతను ఉన్మత్తుడూ కాదు. అల్లంత దూరంలో, ఎవరి కోసమో ఎదురు చూస్తోన్న, ఆ సుందరమ్మ గారి దృష్టిలో పడాలని అతని తాపత్రయం!" అన్నదో తూనీగ. "అని - మీకెలా తెలుసు?" అన్నదా పూవు. "స్వానుభవం. ఇందాకణ్నించీ నేనూ అల్లాగే చేశాను; నీ దృష్టిలో పడాలని!" అన్నదా తూనీగ, ఆ పూవమ్మకు దగ్గరగా జరుగుతూ. ************* "నువ్వెదు కొచ్చావమ్మా? నిన్ను పిలవలేదే!" అన్నాడతను విసుగ్గా. "మరీ - వొంటరిగా ఉన్నారనీ" అన్నదా నిద్ర. అతని పక్కనే చతికిల బడుతూ. ************* "ఉదయం నిన్ను చూసినప్పుడు, నాకు జాలి వేసింది. ఆకులన్నీ రాలీపోయాయి. రెమ్మలు, కొమ్మలు ఎండిపోయాయి. ఇవ్వాళో, రేపో, నిన్ను తొలగించుతారని బాధపడ్డాను". ఇప్పుడు చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేస్తున్నద...