నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇంచుమించు ౧౯౧౬ ఆ ప్రాంతాన తెలుగులో మొదటి ఆధునిక పద్యకావ్యం అవతరించినది. ఇది శ్రీ రాయప్రోలు సుబ్బారావు రచన, తృణకంకణము. ఈ రచనలో - నాకు తెలిసినంతవరకు - మొదటి సారిగా మోహానికి బదులు ప్రేమ, కామవాంఛకు బదులు స్నేహము ఇటువంటి భావాలు ప్రకటిత మగుతాయి. అప్పుడు వారికి ఇంచుమించు సమకాలికంగా అబ్బూరి రామకృష్ణారావు, బసవరాజు అప్పారావు, మహాకవి గురజాడ అప్పారావు తమ క్రొత్త నగలతో ఆంధ్రమాతను అలంకరించారు. ఆ రోజులలో అబ్బూరి రామకృష్ణారావు రచించిన పద్యములను ఇంగ్లీషులో పాస్టరల్ పొయట్రీ అనవచ్చును. ఇది అప్పుడు మలకు క్రొత్త. కాపుపాటలో ఆయన అంటారు. ఇలా... ... ప్రేయసి లేచి రమ్ము, చివురించిన మావులక్రింద శీతల చ్ఛాయలలోన యౌవనవసంతశుభోదయ మయ్యె నవ్వుచున్ చేయికిఁ జేయిఁ జేర్చి పరచింతనలన్ మరపించురాగముల్ దీయుచు వాసన ల్పరిమళించెడు చోటులయందుఁ బోవఁగన్ - అని ఈ ధోరణినే లోకముతో మన కేటికి లోలాక్షీ రా పోదము జీవితంపు వంత గూర్చి పాడు ఈ లోకముతో మన కేటికి - అని దూకుడుతో గానము చేసిన బసవరాజు అప్పారావు కవిత క్రమక్రమంగా పరిణతిని చెంది ఆయన పటపత్రశాయిని గురించి ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా, జంటగా నను పిల్వ ...
క్షోణితలంబు నెన్నుదురు సోకగ వందనంబు తెలుగు తల్లికి.