ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోతన్న కవిత్వ పటుత్వం

తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం.

వామనావతార ఘట్టములో పోతన్న చూపిన కవిత్వ పటత్వము అసాధారణము. ఆ ఘట్టాన్ని అంత సమర్ధతతో చిత్రించగల కవులు ఒకరిద్దరికి మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతయి పెరిగిపోతూండడం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా అలా జరిగినప్పుడే కదా ఆ రసం పలికినట్టవుతుంది

ఇంతింతై వటు డింతయై మరియు దా
నింతై , తోయదమండలాగ్రమున క
ల్లంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై
నంతై, మహార్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్ర
హ్మాండాంత సంవర్ధియై

అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలము, కాంతిరాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదమూ అని ఆ రూపాన్ని పెంచాడు. కాని - ఆ బ్రహ్మాండత్వం పాఠకులకు కరతలామలకంగా కనిపించిందా ఆ మహాద్భుతాకార మెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా తృప్తి లేదు. కాబట్టే

రవిబింబం బుపమింప బాత్రమగు ఛ
త్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై,
సౌవర్ణ కేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి మదం
చద్ఘంగయై, సూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుడు దా
బ్రహ్మాండము న్నిండుచోన్.

అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భత రూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను జేశాడు.

నడి మింట నున్న సూర్యబిబాన్ని చూడమన్నాడు. అది ఎంత యెత్తున వుందో, ఎంత పైకి పోతే దాన్ని తాకగలమో, ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే వుంచి, పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడి కది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పుడా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవిపోగులాగుంది. ఇంకా - మెడ నున్న రత్నంలాగ ఇంకా - భజకీర్తిలాగ ఇంకా - ముంజేతి కంకణం లాగ ఇంకా మొలనూలి మువ్వలాగ, ఇంకా - కాలి అందెలాగ, ఇంకా పెంచాడు - ఆ బింబం పాద పీఠం లాగ వుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్ప నైపుణ్యం ఏమనగలం. మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించ గలరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని...