తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం. వామనావతార ఘట్టములో పోతన్న చూపిన కవిత్వ పటత్వము అసాధారణము. ఆ ఘట్టాన్ని అంత సమర్ధతతో చిత్రించగల కవులు ఒకరిద్దరికి మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతయి పెరిగిపోతూండడం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా అలా జరిగినప్పుడే కదా ఆ రసం పలికినట్టవుతుంది ఇంతింతై వటు డింతయై మరియు దా నింతై , తోయదమండలాగ్రమున క ల్లంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహార్వాటిపై నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్ర హ్మాండాంత సంవర్ధియై అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలము, కాంతిరాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదమూ అని ఆ రూపాన్ని పెంచాడు. కాని - ఆ బ్రహ్మాండత్వం పాఠకులకు కరతలామలకంగా కనిపించిందా ఆ మహాద్భుతాకార మెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా తృప్తి లేదు. కాబట్టే రవిబింబం బుపమింప బాత్రమగు ఛ త్రంబై, శిరోరత్నమై, శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై, ఛవిమత్కంకణమై,...