ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణుడి శిరస్సును సత్యభామ తన్నిందా?

 తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం.


ముక్కు తిమ్మన్నార్యు ముద్దు పలుకనీ, ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడనీ, సహృదయు లన్నారు. మెప్పుకోసము చెప్పిన ఈ మాటలు పాఠకలోకాన్ని తప్పుదారి పట్టించాయేమో అని సందేహం కలుగుతుంది ఎందుచేతనంటే ఈ ప్రశంసపల్ల పాఠకులదృష్టి మాటలమీదను, వాటి ముద్దుతనం మీదను లగ్నమయిపోతుంది. ముద్దు మాటలు చూసి మురిసిపోతారు. ఇంతకంటే ఆ కావ్యంలో చూడవలసిందే లేదని అనుకుంటారు. భావం కోసం బాధపడవలసిన అవసరమే కనపడదు. అందుచేతనే కాబోలు, పారి జాతాపహరణం అభిమాన ప్రబంధంగా పఠించిన వారి సంఖ్య చాల తక్కువ. తక్కిన ప్రబంధాలలోని ఘట్టాలకు ఘట్టాలే కంఠస్థంగా వున్నవారు చాల మంది కనబడతారు; గాని పారిజాతాపహరణంలో నుంచి పట్టుమని పది పద్యాలయినా నోటికి వచ్చినవారు కనబడరు.

ఆ పద్యాలయినా పాదతాడన ఘట్టింలోనివి. "పాటలగంధి చిత్తముల పాటిలు కోపభరంబు తీర్ప" కృష్ణుడు మ్రొక్కిన పద్యము? ... లతాంతాయుధు కన్నతండ్రి శిరము సత్యభమ వామపాదంతో తొలగద్రోసిన పద్యము "ఈసున బూట్టి డెందమున హెచ్చిన కోప దవానలంబుచే గాసిలి" సత్య ఏడ్చిన పద్యము - ఇలాంటివి మాత్రము వినగలుగుతాము. ఆ చదివిన ధోరణిని పట్టుకొని, అప్పుడు జరిగిన వ్యాఖ్యానాలను పట్టుకొని చూస్తే సత్యభామ పాత్రను అపార్థం చేసుకుంటున్నామని తోచక తప్పదు. సత్య తెలిసి తెలిసి, జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరము ను ఎడమకాలితో తన్నినదనీ, మగని కొట్టి ,మొగసాల కెక్కి బొల్లియేడుపు ముద్దు ముద్దుగా యేడ్చినదినీ వారి భావమయినట్టు కనబడుతుంది.

పూర్వ కథ

ఇది సరిగాదని వేరే చెప్పనక్కరలేదు. ముక్కుతిమ్మన ఎంతో నేర్పుతో చిత్రించుకొని వచ్చిన సత్యభామా కోప పరిణామాలను శ్రద్ధగా చూచినవారు ఈ దారిని పోరు. పారిజాత పుష్ప వృత్తాంతము చెలికత్తె చెప్పినప్పుడు ఆమె కోప మంకురించింది. తనను గురించి నారదుడు పలికిన అసందర్భ ప్రలాపముల సంగతి విని,

అన విని వ్రేటుపడ్డ యుర
గాంగనయుం బలె వేయివోయ భ
గ్గన దరికెన్న భీషణ హు
తాశన కీల యనంగ

బుస కొడుతూ మండిపడ్డది. ఈ కోపము ఏ సపత్నికైనను సకారణము మానవతి యయిన సత్యభామకు సమంజసము. రుక్మిణితో సమాన ప్రతిపత్తి గల సౌభాగ్యవతి సత్య.

కులమున్ రూపమున్ మగని కూరిమియున్ గలదాననంచు
అటు రుక్మిణి, యిటు సత్య భావించుకొనేవారు. అదే రవరవలకు కారణము. ఆ రుక్మిణి మందిరములోనే తనను గురించి

నా యంతటివారు లేరని
యహంకృతి నెప్పుడు విర్రవీగుచు౯
వంతునవచ్చు సత్య గరువం
బిక చెల్లదటంచు ... అని

నారదుడు వ్యాఖ్యానించాడని విన్నది. ఏ ఆడుదీ సహించరాని మాటలు. భరింపరాని అవమానము. రుక్మిణి నారదులు పైవారు వారి నేమనుటకు తన కధికారముగాని, చనువుగాని వేదు. కృష్ణుడలా గాదు. తన భర్త. అనుటకూ అనిపించకొనుటకూ తనకు చనువూ అధికారమూ వున్నది. గాబట్టి కోపమూ త్రిగుణీకృతమయి కృష్ణుని మీద కేంద్రీకరించింది. భర్త చేసిన దోషాలను గుణించింది. తనకు కలిగిన అవమానం తలఁచుకుంది. తన జీవితాశ భగ్నమయిందని గుర్తించుకుంది.ఉన్న విలాసాల కన్నిటికీ వీడ్కోలిచ్చింది. నిందించ వలసినదంతా నిందించింది, ఆడి పోయ వలసినదంతా ఆడిపోసింది. మాసిన చీర కట్టి, చీక టింటికడ కంకటినే(మంచము) పడి పొర్లుతూంది. అక్కడ, మాటలాడకపోయినా, ఇందాకటి నిందాది విషయాలన్నీ మనసులో తిరుగుతూనే వున్నాయి. ఆయా విషయాల కనుగుణంగా కన్ను మూస్తుంది, తెరుస్తుంది. వెగటు నవ్వు నవ్వుతుంది. కానీ యన్నట్టు తల వూపుతుంది. చివరకి

(౧) మదహస్తి హస్తగత
పద్మినియుంబలె సొంపు పెంపరన్

మదించిన యేనుగు తొండానికి దొరికిపోయిన తామరతీగలాగ, బలరహితమై జిగీబిగీ ఏమీ లేనట్టు వుండిపోయింది.


ఉపశమన ప్రయత్నము

అలా వుండగా కృష్ణడు వచ్చాడు. శోభా రహితంగా వున్న లోగిలి చూచి యిది పారిజాతం వల్ల కలిగిన గోలే అని గ్రహించాడు. కాని చెలికత్తె ఎంతవరకు చెప్పిందో అది మాత్రం తెలియదు. ఒక చెలి చేతనున్న వీవన తీసుకొని తాను విసురుతున్నాడు. ఏదో నూతన దివ్యవాసన సత్యకు గోచరించింది. పారిజాత పరిమళం తనకు తెలియదు. కాబట్టే విస్మయం (౧) కలిగి , ముసుగుతోని చూచింది. తన భర్త. అదే పారిజాత పరిమళము. నిదర్శనంతో కనబడిన ద్రోహి. ఇందాకటి విచారానికి పునరుజ్జీవనం కలిగింది. దుఃఖము పొర్లుకొని పచ్చింది. కన్నీరు కారుతూ వుంది. ఏడుస్తూ ఉన్నట్టు కనబడడం తన కిష్టంవేదు. మళ్ళీ ముసుగు వెట్టింది.

ఇన్నమితావి ఆంశు కాంతమై

పెద్ద నిట్టూర్పు తీసింది. మంచానికి చుట్టూ కట్టిన తెర అంచులు చలించాయి. ఏమనడమో తెనియదు. మాన క్రోధములచే కుమారిలి పోతూ వుంది.

ఆ సమయముల కృష్ణుడు ఉపశమనవాక్యాలారింభించాడు. నగలు ధరించలేదేమి, నావైపు చూడవేమి - అని నంగిరి మాటలు. సత్యకు ఎంతవరకు తెలుసునో తనకు తెలియదు కాబట్టి ఆమె చేతనే పలికించాలని, అసలు కోపకారణము సంగతే ఎత్తడు. ఆ కారణ మేమిటో కృష్ణుడికి బాగా తెలుసునని సత్యభామకు తెలుసును. ఇదంతా కపటమే. తనను వంచన చేయడమే. చేసిన ద్రోహానికి తోడు ఈ నటన. ఈ కపటం సహించడం కష్టం. ఇంతలో ఇతర కాంతలకు గారవము.

మెరమెచ్చులకై వచరింతుకాని, సా
యని యనురక్తి నీయెడల ...

అని కృష్ణుడు ఏమో అంటున్నాడు. ఇదే మెరమెచ్చుల కంటున్నమాట యని సత్యకు నిరూపిత మవుతూంది. అసహనం అధికమయి అసహ్యంగా పరిణమిస్తూంది. ద్రోహి, వంచకుడు, కపటి, నమ్మించి గొంతుకోసే వారిలాగ పొడచూపుతున్నాడు. అతడు తనకంత దగ్గరగా ఉండడమే బాధగా కనిపిస్తూంది. అది కృష్ణుడు గుర్తించుకోలేదు. సాధారణమయిన అనునయసూత్రాల ప్రకారము బాహాపరీరంభము కాకపోయినా కడకంటి చూపయినా తన కనుగ్రహించరాదా ఉంటూ, సత్య చీరచెరంగు పట్టుకోబోయాడు. సత్య సైచునా ఛీ దూరముండు అన్నంత అర్థముతో

చేవిరిదమ్మి వ్రేయుటకున్తె
యుంకించి జంకించినన్

చేతితో(విరిదమ్మి వంటి చేతితో) కొట్టబోయింది - చెవిదగ్గర అనహ్యంగా గోల పెడుతున్న జోరీగను విదిర్చినట్టు.

ప్రయోజనము లేదు. దానితో కృష్ణడు తన విధానము మార్చక తప్పింది గాదు. ప్రణయ కలహానునయాలలో పురుషులపాలిటి సమ్మోహనాస్త్ర మయినది నమస్కారము. దాసుడి తప్పే గాదు. ధూర్తుడి తప్పు గూడా దండంతో తీరిపోతుంది. ఈ సాధనను ఉపయోగించి కృష్ణడు అర్మిలి ,మ్రొక్కె. (౩) మ్రొక్కినన్ ---

ఇక్కడే వుంది చిక్కు. ఆ జగన్నాటక సూత్రధారి యదునందనుడర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్ అని చదివి, ఊపిరైనా తీయకుండా పారిజాతా పహరణము చదువుతున్న పాఠకులు ఉత్సాహంచో, కంఠమెత్తి వొక్క బిగువున

జలజాతాసన వాసవాది సుర
పూజా భాజలంబై తన
ర్చు లతాంతాయుధుకన్న తండ్రి శిర
మచ్చో వామ పాదంబునన్
తొలగత్రోచె లతాంగీ ... ...

అని చదువుతారు. అదంతా ఆ సత్యకు గుర్తున్నట్టు. ఎంతటి జంత వంత దుర్మార్గురాలు ఈ సత్య అని మనచేత గూడ అనిపించేస్తారు. సత్యపాత్ర దానితో సర్వనాశన మవుతుంది. ముక్కుతిమ్మన యింతవరకు మీ కౌశలముచో నిరూపించుకొంటూ వచ్చిన కోపభావ పరిణామ పరంపర అంతా బూడితను పోసిన పన్నీరవుతుంది. ఈ కథతో కృష్ణరాయ అంతఃపుర విషయాన్ని చక్కట్లు దిద్దాలని కవిచేసిన (నిజమయితే) ప్రయత్నమందా గంగలో కలిసిపోతుంది. ఇటవంటి దుష్ట ప్రవర్తన గల సత్యతో మహారాణిని సరిపోలుస్తాడా తిమ్మన?

కూడరు కాదు. మ్రొక్కినన్ అన్న తరవాత వచ్చిన ఈ జలజాతాసన వాసవాది... అన్న సోదె అంతా కథ కాదు. కల్పన. కవి ఊహ - అంతే. అసలు కథ ఏమిటంటే మ్రొక్కినన్, శిర మచ్చో వామపాదంబునన్ తొలంగం ద్రోచె లతాంగి. తన్నలేదు. తొలగ ద్రోసింది. ఇందాక వైట చెరగు పట్టబోయినప్పుడు చేయి విదల్చినట్టే, ఇప్పుడు పాదాన్ని తాకుతూ వున్న తలను తొలగించింది. ఆ తల యెడమకాలికి కొంచెం దగ్గరగా ఉండడంవల్ల ఆ వామపాదంతోనే తొలగద్రోసింది. ఆ తల మోతేతికి తగుల్తూ వుంటే మోచేతితోనో తొలగించి వుడేది. అంతేగాని ఎంచి యెంచి ఎడమకాలే ఉపయోగించాలని చేసిన పని కాదు. అసహ్యాన్ని తెలియజేసే అమాయకపు చర్య.

ఇకను ఆ తల గురించి. చూస్తూ వున్న కవికీ, కావ్య పాఠకులకూ అది జలజాతాసన వాసవాది సురపూజా భాజనమూ, లతాంతాయుధు కన్న తండ్రి శిరమూను. కాబట్టి మహాపవిత్రము కావచ్చును. ఆడువారు పురుషులయందు కోరే చదువు, సంపద, చక్కదనము అన్న మూడు విషయాలలోను అగ్రగణ్యులనిపించుకునే జలజాతాసనుడు (బ్రహ్మ), వాసవుడు (ఇంద్రుడు), లతాంతాయుధుడు (మన్మధుడు) అన్న ముగ్గురిని మించినవాని శిరమని రసజ్ఞు లనుకోవచ్చును. కాని ఆనాడా సన్నివేశములో సత్యభామకు ఆ దృష్టి లేనేలేదు. తానొక ఆడుది. ఆ శిరము మహాద్రోహ మొనర్చిన తన భర్త శరీర భాగము మాత్రమే. తనను ఏ ఆడది కూడా (అందులో ముఖ్యంగా సత్య వంటి మానవతి) సహింతరాని ఘోరమయిన అవమానంపాలు చేని యిప్పుడు వచ్చి మెర మెచ్చులకై కపటపు మాటలాడుతూవున్న తన మగనిది. తేరువకు వచ్చి చెరగుపట్ట దానినే సహించలేక యిందాక చేయి విదిల్చింది. ఇప్పుడు ఆ ద్రోహి శరీరాన్ని తాకుతున్నాడు. సామీప్యాన్నే సైచలేని సతయ సంస్పర్శనను సైచగలదా ఇప్పుడు కాలు విసిరింది. రెంటి యందూ భావ మొక్కటే. దోషముంటే దోషమూ వొక్కటే. ఈ భావాన్ని గ్రహించగలిగిన వారికి మన కవి కోప పరిణామాలను నిరూపించడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంత మానవ స్వభావ పరిశీలనానుభవము కనబరిచాడో ఎంత అనన్య సామాన్యమయిన ప్రతిభను ప్రకటించాడో తేటతెల్లము కాకపోదు. ముక్కుతిమ్మన్న ప్రఖ్యతి ముద్దుముద్దు పలుకులలోనే కాదని, మనః ప్రవృత్తుల క్రమచిత్రణము మొదలయిన అనేక అమోఘ విషయాలలో నున్నదని స్పష్ట మయివుండేది. గ్రంధము అధిక సంఖ్యాములకు అభిమాన ప్రబంధమయేది. వందలకొలది పద్యాలు కంఠస్థములయి ఉండేవి.

ఈ అమాయక (మహాసహజ) చేష్టను - తొలగ ద్రోయడాన్ని - తాపు అని పేరుపెట్టి పలికిన వాడు కృష్ణుడు. సమయస్ఫూర్తి గల కార్యార్థి ప్రజ్ఞావంతుడు. దీని నొక సాధనంగా చేసి తన కార్యము సాధించాలని చూచాడు.

నను భవదీయదాసుని
మనంబున నెయ్యపు కిన్క బూని తాఁ
చిన యది నాకు మన్ననయ,

అన్నాడు. తొలగ ద్రోయడానిని తాచడం(తాపు) అన్నాడు. తొలగద్రోయడానికి తన్నడం అని ఏ పండితుడు అర్థం చెప్పగలడు ఏ నిఘంటువు ఆ అర్థం ఇస్తుంది(౪). ఇందాక చేయి విసిరినప్పుడు ఆ చేయి తనకు తగిలియుండి ఉంటే, నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్క బూని కొట్టిన యది నాకు మన్ననయ అని అనేవాడే. అప్పుడు దగలలేదు. ఇప్పుడు కాలు తగిలింది. ఆ విషయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నాడు కృష్ణుడు - కుహనా గోపాలుడు. ఈ తాపు కృష్ణడి తలను పుట్టి, నోటను బయటపడ్డదై. సత్యభామ తన్నినదికాదు.

నమస్కరించడంలో కృష్ణుడి తల సత్య ఎడమకాలుకి తగిలింది. ఆ సామీప్యం సహించలేక సత్య ఆ ఎడమకాలుతోనే దాన్ని త్రోసింది(అనగానెట్టివేసింది).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం