Sunday, January 31, 2010

అగస్త్యుడు

శ్రీ రామరక్ష :

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై
భీముడు తిన్న పండివంటలు జీర్ణమై
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై
అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై
కుంది లాగా కూర్చొని
నంది లాగా లేచి
తాంబేలు లాగా తాళి
చల్లగా ఉండాలి
శ్రీరామ రక్ష
నూరేళ్ళాయుస్సు

తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు

బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు.

తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది.


ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది.

జననం:

           అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది.

ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు తన కులపురోహితుడైన వసిష్ఠ మహర్షితో "నేను ఒక యాగం సంకల్పించాను. ఆధ్వర్యులుగా వుండి మీరాయజ్ఞం జరిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి" అని వేడుకుంటాడు. అందుకు వసిష్ఠుడు 'రాజా! దేవేంద్రుడు ఇంతకుమునుపే తన యాగానికి నన్ను హోతగా నియమించాడు. అది పూర్తి కాగానే వచ్చి మీ క్రతువు నిర్వహిస్తాను. అంతవరకు కొంచెం ఓపికపట్ట' మని చెప్పి వెళతాడు.

సవనానికి కావలసిన సర్వపదార్ధాలూ సమకూర్చుకొని వుండటం చేత నిమి చక్రవర్తి ఆయన వచ్చేవరకు తాళలేక గౌతమమహర్షిని పురోహిునిగా నియమించి, అత్రి చ్యవనాది ఋషులను ఋత్విక్కులుగా పరిగ్రహించి సత్రయాగం సాగిస్తుంటాడు.

గురశిష్యుల శాప ప్రతిశాపాలు
ఇంద్రయాగం పరిసమాప్తి చేసి వసిష్ఠుడు వస్తాడు. ఇక్కడ నిమి చక్రవర్తి యజ్ఞం జరుగుతూ వుంటుంది. అది చూడగానే వసిష్ఠునకు ఒళ్ళు భగ్గుమంటుంది. 'గురుణ్ణి నన్ను తిరస్కరించి మరొక్కని గురువుగా స్వీకరిస్తాడా? ఏమి వీని కండకావరం! ఇతని పొగరణుస్తాను' అంటూ వసిష్ఠుడు యాగశాలలోకి ప్రవేశిస్తాడు.

బడలికవల్ల పగటిపూటనే ఒకచోట నిదురిస్తున్న నిమిని గ్రుడ్లురిమి చూస్తూ  నన్ను నిర్లక్ష్యం చేసిన నేరానికి నీవు శరీరం విడుతువు గాక! అని శపించి ధిక్కరిస్తాడు.

నిమి నిద్రమేల్కొని 'నేను నీ శిష్యుణ్ణి. నిరపరాధిని. వృథాగా నన్ను శపించావు. దురాత్ముడవైన నీవుకూడా నాలాగానే దేహం వీడుదువు గాక!' అని గురువుకు ప్రతిశాప మిస్తాడు. ఇలా గురుశిష్యులు పరస్పరశాపాల వల్ల విదేహులవుతారు.

వశిష్ఠులు దుఃఖంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి 'నిమి శాపం మూలాన నా స్థూలదేహం నశించింది. సూక్ష్మశరీరంతో మీ పాదాల దగ్గరికి వచ్చాను. నాకు స్థూలకాయం ప్రాప్తించే ఉపాయం చెప్పిండి' అని దీనంగా వేడుకుంటాడు.

విరించి కరుణించి 'నీవు మిత్రావరుణుల తేజస్సులందు యోగవిద్యాబలంతో ప్రవేశించి మళ్ళీ దేహాన్ని ధరించు' మని పలికి పంపుతాడు.

ఒకనాడు మిత్రావరుణులు సాగరతీరాన సంచరిస్తూ త్రిలోక సుందరియైన ఊర్వశిని తిలకిస్తారు. వారివురి తేజస్సును అప్సరస ఒక కలశంలో వుంచుతుంది. ఆ కలశం నుంచి వసిష్ఠుడు, అగస్త్యుడు ఉద్భవిస్తారు.

కుంభం నుంచి జన్మించడంచేత కుంభసంభవుడు, మిత్రావరుణుల పుత్త్రుడవండం వల్ల మైత్రావరుణి, ఊర్వశి నందనుడు కాబట్టి ఔర్వశేయుడు అనే పేర్లతో అగస్త్యుడు ప్రశస్తి వహిస్తాడు.

లోకహితార్థం ఆయన చేసిన ఘనకార్యాలు అనన్యసాధ్యాలు, అత్యద్భుతాలు. ఆయన ఆకారంలో పొట్టివాడు. కాని శక్తి సామార్థ్యాలలో, బుద్ధి చాతుర్యంలో గట్టివాడు. వాతాపిదైత్యుని గుట్టుగ దిగమ్రింగి గర్భగోళంలో జీర్ణించుకొన్న మహానుభావుడీయన.

వాతాపీ! బయటికి రా!

మణిమతీపురంలో ఇల్వలుడు, వాతాపి అనే అన్నదమ్ములుండేవారు. వాళ్ళు రాక్షసులు. క్రూరకర్ములు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని భక్తితో ఆరాధించి అన్ని కోరికలు సిద్ధింపజేసే మంత్రాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తాడు. విప్రుడు తిరస్కరిస్తాడు. అందుచేత ఇల్వలుడికి ఆయన మీద పట్టరానంత ఆగ్రహం కలుగుతుంది. అతనితోపాటు బ్రాహ్మణజాతినంతా సర్వనాశనం చెయ్యాలని వాడు సంకల్పిస్తాడు.

దానవులు కామరూపులు గనుక ఇల్వలుడు విప్రవేషం ధరించి సంస్కృతభాష మాట్లాడుతూ భూసురులను అనుదినం భోజనానికి ఆహ్వానించేవాడు. మేకగా మారిన వాతాపిని వధించి వాని మాంసం చక్కగా వండించి ఆ వచ్చిన అతిథులకు వడ్డించేవాడు. వారు కమ్మగా ఆరగించిన తర్వాత ఇల్వలుడు తృప్తి అయిందా అని అడిగి 'వాతాపీ! బయటికి రా!' అని బిగ్గరగా తమ్ముణ్ణి పిలిచేవాడు. పిలుపు వినగానే వాడు పునర్జీవితుడై మేకలాగా మే, మే అని అరుస్తూ భోక్తల పొట్ట చీల్చుకొని వెలుపలికి వచ్చేవాడు. అతిథులు హరీ అని అసువులు విడిచేవారు. ఇలా ఎందఱో అమాయకులు హరీ అన్నారు.

అగస్త్యుడు బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి చాలాకాలం దారుణమైన తపస్సు చేస్తాడు. అడవుల్లో సంచరిస్తూ అతడొక రోజు చెట్టు కొమ్మ నుంచి తలక్రిందుగా వ్రేలాడుతున్న వ్యక్తుల్ని చూసి విస్తుపోయి 'మీరెవరు? ఎందుకిలా వ్రేలాడుతున్నారు?' అని ప్రశ్నిస్తాడు.

వారు 'అయ్యా! మేము మీ పితరులం. నీవు పెళ్ళి చేసుకొని బిడ్డలను కనకుండ బ్రహ్మచారివై తపస్సు చేస్తున్నావు. అందువల్ల ఊర్ధ్వగతులు చెడి మేమిలా అల్లాడుతున్నాం. ఇప్పిటికైనా నీవు పెళ్లాడి కొడుకులుగంటే మాకు అధోగతులు తొలగి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి' అని విచారంతో చెబుతారు.

అగస్త్యుడు అందుకంగీరించి సంతానార్థియైన విదర్భరాజుకు తన తపశ్శక్తి చేత ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆమె పేరు లోపాముద్ర. నీటిలో తామరవలె, అభ్యాసనపరునియందు విద్యవలె ఆ బాలిక దిన దినాభివృధ్ధి పొందుతుంది. రూపవతియైన లోపాముద్ర పెరిగి పెల్ళి యీడుకు రాగానే విదర్భేశ్వరుడు తనయకు తగిన వరుణ్ణి అన్వేషిస్తుంటాడు.

అంతలో అగస్త్యుడు అతని దగ్గరకు వచ్చి తనకు లోపాముద్రనిమ్మని అడుగుతాడు. విదర్భపతి మునికోరిక విని 'నారబట్టలు ధరించి, కందమూలాలు భుజిస్తూ, అడవుల్లో ఘోరమైన తపస్సుచేస్తూ కృశించియున్న ఈ బ్రాహ్మణుడు సుకుమారియైన నా సుతను పెళ్ళాడి ఏమి సుఖపెడతాడు? భోగాలనుభవించదగిన కన్యను తెలిసి తెలిసీ ఈ యతికి ఎలా ఇవ్వను? ఇవ్వకుంటే వూరకుంటాడా? శపిస్తాడు గాని సహింపడు. దైవమా! ఏమి గతి!' అని లోలోపల కుములుతుండగా లోపాముద్ర తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ఈ మునీంద్రుడుకి నన్ను ప్రీతితో ఇచ్చి పెళ్ళిచేయండి అని నచ్చచెపుతుంది. వారు వైభవోపేతంగా అమ్మాయిని అగస్త్యున కిచ్చి వివాహం చేస్తారు.

అగస్త్యుడు లోపాముద్రను పరిగ్రహించి ఆమె ధరించిన దివ్యాంబరాలనూ, ఆభరణాలనూ అప్పటి కప్పుడే విసర్జింపజేసి, నారచీరలు కట్టించి గంగాద్వారం చేరుకుంటాడు. అక్కడ తపస్సు చేస్తుండగా మునికి సంసారాభిలాష కలుగుతుంది.

లోపాముద్ర భర్తను చూసి 'నాథా! నాకు అందమైన చీరలు సుందరమైన నగలు తెచ్చియివ్వండి' అని కోరుతుంది. అగస్త్యుడు ధనం కోసం తపశ్శక్తిని వృథా చేయడం ఇష్టం లేక శ్రుతపర్వుడనే రాజును ధనం కోసం ఆశ్రయిస్తాడు.

ఆ రాజు తనకు ఆదాయవ్యయాలు సమానం కావడం వల్ల మిగులు ధనం లేదని తెలిపి, అగస్త్యుని బ్రధ్నస్యుడనే ప్రభువు దగ్గరికి తీసుకువెళతాడు. బ్రధ్నస్యుడి పరిస్థితి అలాంటిదే అని తెలుసుకొని, ముగ్గురూ త్రసదస్యుడనే జనపతి దగ్గరకు పోతారు. త్రసదస్యు డగస్త్యునితో 'ఈ మణిమతీ నగరంలో ఇల్వలుడనే దైత్యుడు వాతాపి అనే తమ్ముడితో వుంటున్నాడు. ఈ లోకంలో అందరికన్నా వాడే గొప్ప ధనవంతుడు. అతడు మన అభీష్టాన్ని తప్పక నెరవేర్చగలడు' అని అంటాడు.

రాజర్షులు ముగ్గురూ మహర్షిని వెంటబెట్టుకొని ఇల్వలుడి దగ్గరికి వెడతారు. ఇల్వలుడు వారిని అర్ఘ్యపాద్యాలతో అర్చించి ఎప్పటిమాదిరి వాతాపిని సంహరించి అగస్త్యుడికి ఆహారంగా సమర్పిస్తాడు. ముగ్గురు రాజులు ముందుగా మునీంద్రునితో వీని యింటిలో భుజింప వద్దనీ, విత్తమిస్తే తీసుకొని వెడదామనీ రహస్యంగా విషయమంతా వివరించారు.

అగస్త్యుడు అణుమాత్రమైన చలించక అతడు పెట్టిన ఆహారాన్ని ఆరగిస్తాడు. మౌని ఆరగించిన వెనుక మునుపటిలాగా ఇల్వలుడు తమ్ముణ్ణి రమ్మని పిలుస్తాడు. అతడు పిలిచేలోపల తాపసి తన కడుపు తడువుకొంటూ గర్రున త్రేపుతాడు. వాతాపి ఆ క్షణంలోనే అగస్త్యుని బొజ్జలో జీర్ణమై పోతాడు.

ఇల్వలుడు మునిశక్తికి భయపడి ఏమీ జరగనట్లు ఎంతో ఉల్లాసం నటిస్తూ వినయపూర్వకంగా అతని రాకకు కారణమడుగుతాడు. అగస్త్యుడు కూడా ఏమీ ఎరగనట్లు కనిపిస్తూ 'నీ దగ్గర అపారధనరాసులున్నాయని తెలిసి ఈ రాజవరులతో ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్క భూపతికి పదివేల గోవులు, పదివేల గద్దెల బంగారం ఇవ్వు. అంతకు రెట్టింపు గోధనం, సువర్ణమయమైన రథం నాకివ్వు' అని అడుగుతాడు. ఆ విధంగానే ఇల్వలుడు సమర్పిస్తాడు.

అగస్త్యుడు ఆ ద్రవ్యంతో ఆశ్రమం చేరి లోపాముద్ర కోరిక తీర్చి 'దేవీ! నీకు పదిమందితో సమానులైన వేయిమంది పుత్రులు కావావా ? వెయ్యిమందితో ధీటైన ఒక్క కుమారునే కోరుకుంటావా? చెప్పు' అని అడుగుతాడు.

మహాసాధ్వియైన రాజపుత్రి పతిని చూసి 'ప్రాణేశ్వరా! తమవంటి వీర్యగుణ సంపన్నుడైన ఒక్క ఉత్తమ తనయునే కోరుతున్నాను.' అని అంటుంది.

లోపాముద్ర ఏడేళ్ళు గర్భం ధరించి దృఢదస్యుడనే సువుత్రుణ్ణి కంటుంది. దృఢదస్యునకు తేజస్వియైన ఇధ్మవాహుడనే కుమారుడు పుడతాడు. ఈ రీతి అగస్త్యుడు పుత్రపౌత్రవంతుడై తన పితరులకు పుణ్యగతులు కలిగిస్తాడు.

కన్నతల్లినీ, ఉన్న వూరునూ శాశ్వతంగా విడిచి పెట్టడం ఎంతటి త్యాగపురుషులకైనా శక్యం గాదు. ఇది పరోపకారపారీణుడూ, స్వార్థరహితూడా అయిన అగస్త్యునికే చెల్లింది.

మా యిద్దరిలో ఎవరు గొప్ప

అగస్త్యుడు లోపాముద్రతో వారణాసిలో విశ్వనాథుణ్ణి సేవిస్తూ గడుపుతున్న రోజులవి. నారదభగవానుడు తీర్థయాత్రలు చేస్తూ వింధ్యపర్వతం దగ్గరకు వస్తాడు. వింధ్యాచలం అతడికి ఎదురేగి అర్ఘ్యపాద్యములిచ్చి ఆదరించి చేతులు జోడించి 'మహానుభావా! మీ దర్శనం వల్ల నా జన్మ చరితార్థమయింది. సర్వపర్వతకులంలో మాన్యుడనయ్యాను, ధన్యణ్ణాయ్యను.' ఒక్క విన్నపం.

'ఈ మహీమండలంలో మీరు చూడని గిరులు లేవు. మందర గంధమాదనాది పర్వతాలు ఒకపాటివి. ఇక చిరుకొండల మాట చెప్పనవసరం లేదు.ఒక్క మేరుగిరి మాత్రమే నాతో ప్రతిఘటించగలదు. మహర్షీ! కొన్నళ్లుగా ఆధిక్య విషయమై మా మధ్య రవరవలు చెలరేగుతున్నాయి. మా యిరువురి తారమమ్యం మీకు బాగా తెలుసు. మొగమాట పడక పక్షపాతం విడిచి మా యిద్దరిలో ఎవరు గొప్పో చెప్పిండి' అని అడుగుతుంది

నారదుడు కలహప్రియుడు కదా! లోకోపద్రవకారణమైనప్పటికీ ఆ కొండలు రెంటికి తగవు పెట్టి తమాషా చూడాలని అనుకుంటాడు. ఆయన ఒక్క క్షణమాగి వింధ్యగిరితో 'ఓ శైలమా! మాలో ఎవరెక్కువ అని నీ వడగినట్లే మేరునగం కూడా మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని నన్ను ప్రశ్నించింది'. నీ శక్తి నీకు, తనశక్తి మేరువుకూ తెలియదా? కావాలని మీరు నా బుద్ధిపాటవం పరీక్షిస్తున్నారు. నిజంగా మీ వుభయుల బలాబలాలు నాకు తెలీవు. కానీ మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మీ గర్వోక్తులు విని సహించలేక పోతున్నాను. వాస్తవం చెప్పవలసివస్తే మహిమలో మీ యిద్దరికంటే శ్రీశైల వేంకటాచాలాలు ఎంతో గొప్పవి. మీ మిడిసిపాటు వాటికి లేదు. అయ్యా, మాలాంటి తీర్థయాత్రాపరులకు మీ గొడవలతో ఏమి పని?  వెళ్ళివస్తాను.' అంటూ నారదు డక్కడనుండి నిష్క్రమించాడు.

దేవమునీంద్రుని పలుకులు ములుకలై వింధ్యగిరిని బాధిస్తాయి. అతనికి మేరుపర్వతంపై పగసాధించాలనే ఆరాటం అంతకంతకూ అధికమవుతుంది. అతడు తన మనస్సులో 'శత్రువును జయించని వాని జన్మ మొక జన్మమా? తనంతటి విరోధి ఒకడు తన కళ్ళముందు విర్రవీగుతంటే కంటికి నిద్రవస్తుందా? వంటకం రుచిస్తుందా?' అసలెవ్వరితోనూ కాలు దువ్వరాదు. .కాలు దువ్వినప్పుడు కసి తీర్చుకొనక వెనుకంజ వేయరాదు.

మేరుగిరి అదృష్టం తలుచుకుంటే నా గుండె భగ్గుమంటుంది. పగటిపూట భానుడు, రాత్రులందు చంద్రగ్రహతారకలు అతని చుట్టూ ప్రదక్షిణం చేయడమా? నీకీ కర్మ ఎందుకని ప్రశ్నిసేతం విధినియమం అంటాడు. మేరు విజృభణం కనులారా చూస్తూ ఎలా సహించడం? సూర్యచంద్రులు మేరుగిరికి ప్రహరి తిరుగకుండా నిరోధిస్తాను. గగనతలాన్ని ఆక్రమిస్తాను' అంటూ వింధ్యపర్వతం త్రివిక్రమ స్వరూపం ధరిస్తుంది.

వింధ్యపర్వతం అడ్డగించడం చేత రవితేరు ఆకాశమధ్యంలో అట్టే ఆగిపోతుంది. సూర్యచంద్రగమనాలు కట్టుబడిపోవడం వల్ల ఇది పగలు, ఇది రాత్రి అని భూలోక వాసులకు తెలియడంలేదు. వర్షాలు కురియవు. జగములు అంధకారబంధురాలైనాయి.

ఈ అకాల ప్రళయానికి దేవమునీంద్రులు తల్లడిల్లి బ్రహ్మలోకానికి పోయి పరమేష్ఠిని పలువిధాల స్తుతిస్తారు. బ్రహ్మదేవుడు మునీశ్వరులకు అగస్త్యుడిని ప్రార్థించమని చెబుతాడు.

బృహస్పతి, మునీశ్వరులూ కుంభసంభవుని కడకేగి 'మహాత్మా! మీ ప్రతాప ప్రభావాలూ, ఔదార్యమూ పొగడ తరమా? బ్రహ్మదేవుని ఆజ్ఞవల్ల మిమ్మొకటి కోరటానికి వచ్చాము. వింధ్యపర్వతం మేరువుతో పోటీపడి నక్షత్రగ్రహ తారాచక్రాన్ని చిక్కుపరిచింది. ఈ ఆపద బాపటానికి మీరే సమర్ధలని బ్రహ్మ పంపగా వచ్చాము.' అంటారు.

వాచస్పతి మాటలు విని అగస్త్య మునిపుంగవుడు  'మీరు నన్నింతగా వేడుకోవడం దేనికి? కార్యం చక్కదిద్దటానికి సర్వవిధాలా యత్నస్తాను. అన్నిటికీ మనపాలి కల్పవృక్షం విశ్వనాథుడున్నాడుగదా! మీరు నిశ్చింతగా మీ నివాసాలకు వెళ్ళండి' అని వారిని సాదరంగా వీడ్కొల్పుతాడు.

ఇంకా వుంది.

ధర్మపాల విజయము

ఉత్తర భారతావనిలో కళలకు కాణాచియై కళ్యాణపురంబు కలదు. అందు శిల్పకళాకోవిదుడైన విశ్వకర్మ వంశీయుడగు ధర్మపాలుడు అను శిల్పాచార్యుడు కలడు. అతడు విద్యలలో బృహస్పతితో సమానుడు. సకల శాస్త్ర మంత్రసిద్ధుడు. అతని శిల్పచాతుర్యమునకు ప్రభువులు మెచ్చి అర్థాసనమిచ్చి గౌరవించిరి. అతనినాశ్రయించి ఎందరో శిల్పకళాకోవిదులు జీవించుచున్నారు. అతని శిల్పశాలయందు అగ్ని, జల, వాయు యంత్రములు అమర్చబడియున్నవి. ఆ కళాక్షేత్రమున కులదైవములగు శ్రీ విశ్వకర్మ భగవానుడు, శ్రీ కామాక్షిదేవి ఆలయములు నిర్మించి ప్రతిష్టించి నిత్యము శిల్పాచార్యులు ఆరాధించుచుందురు.

ఆ ధర్మపాలునకు రుద్రసేన, భద్రసేన, ఇంద్రసేనులను కుమారులు గలరు. వారు తండ్రితో సమాన ప్రతిభావంతులు. నియమ నిష్టాగరిష్టులు, మంత్రవేత్తలు. గదా, ఖడ్గ, బాణ యుద్ధములలో నిపుణులు. ఆ శిల్పాచార్యులు భస్మ, రుద్రాక్షమాలా విభూషితులై సదా వేదాధ్యయనమొనర్చును. శరణాగతత్రాణ బిరుదాంకితులై వెలయుచుండిరి.

ఆ శిల్పాచార్యులు తమ శిల్పకళానైపుణ్య ముట్టిపడునట్లు సువర్ణ, రజిత, తామ్ర, కాంశ్యాది లోహంబులతో

విగ్రహములు చేయుచుండిరి. వెండి పన్నెండువంతులు, రాగి పదునారు వంతులు, బంగారు పదివంతులు కలిపి మిశ్రమలోహము న దైవ విగ్రహములు రూపొందించి మృత్యువు, దరిద్రము నశించును. శాస్త్రవిధిననుసరించి పంచలోహమును తయారుచేసి మయ సిద్ధాంతాను సారముగా చేయుచుండిరి.
ఉత్తమ నవతాళము ననుసరించి  శిరస్సుపొడవు నాలుగంగుళములు, ముఖము పొడవు పన్నెండంగుళములు, కంఠము నాలుగంగుళములు, స్తనమధ్యము వరకు పండ్రెండంగుళములు, స్తన మధ్యము నుండి నాభివరకు పండ్రెండంగుళములు...

ఈ విధముగా నవతాళ ప్రమాణమున దైవ విగ్రహములను సర్వాంగసుందరముగ రూపొందించి, ఇంకను ప్రజోపయోగకరములగు నిత్యావసర వస్తువులను, విలాసవంతులు భోగములకుపయోగించు అలంకార సామగ్రులను, ఎన్నెన్నో చిత్రవిచిత్ర వస్తువులను ఆకర్షణీయముగా నిష్ణాతులగు శిల్పాచార్యులచే తయారు చేయించి బండ్లపై సిద్ధము చేయించి, దేశము నలుమూలల విక్రయించుచు విశేషఖ్యాతిని గడించుచు, అపరిమితి ధనంబార్జించుచు, తిరిగితిరిగి కొంత కాలంబునకు కాంచీపురంబు ప్రవేశించిరి.

ప్రసిద్ధ శిల్పకళా పోషక నగరమని ప్రశస్తిగాంచిన ఆ కాంచీ పట్టణమున తమకు పూర్వమిత్రుడు కామకోటి పీఠాధిపతియగు శ్రీ శంకరాచార్యులను కలుసుకొని అతని ఆతిధ్యమును, సత్కార్యములను పొందినవారై, శ్రీ ఏకామ్రేశ్వరుని దర్శించి, కామాక్షీదేవిని సేవించి, వరదరాజ స్వామిని పూజించి, ఆలయ శిల్పసౌందర్యము వీక్షించి తమ జన్మ సఫలత నొందెనని సంతుష్టాంతరంగులైన ఆ శిల్పబ్రహ్మలు తమ వ్యాపారమునకనువగు స్థలమును శ్రీ కామాక్షీదేవి ఆలయ ముఖద్వారమున నున్న సువిశాల భూభాగముగా నిర్ణయించుకొన్నవారై అందు గుడారములనిర్మించి, తమ వద్దనున్న వస్తువునందు ఆకర్షణీయముగా వరుసలు దీర్చి, పేర్చి అలంకరించిరి.

ఇంకను అనేకములగు వస్తువులను మెరుగులు దిద్ది అందముగా అలంకరించి అమ్ముచుండగా పురజనులు వానిని కొనుటకై కొల్లలుగా వచ్చుచుండెను. ఏ వస్తువైనను ఎత్తునకు రెండెత్తుల బంగారము నకు తూనికతో యేవిధమగు మారుబేరములు లేక విక్రయించుచుండిరి. నానాటికి నగర పరిసర ప్రాంతముల నుండి ప్రజలు వివిధ వాహనములపైనను, కాలినడకను, నగరమునకు వచ్చుచుండిరి.

ఆనాడు మహాశివరాత్రి పర్వదినము. కామాక్షీదేవి దర్శనముకై కాంచీపురాధీశుని గారాలతనయ తన చెలికత్తెలతో కూడి ఆలయమునకేతెంచి దేవిని దర్శించి, ఆలయప్రాంత విశేషముల తిలకించుచు కాంశ్యపాత్రలలో అత్యన్త ఆధునికమగు పద్ధతులతో యిరువైపుల రెండుమయూరములు పురివిప్పియున్నట్లుగా చిత్రించి వానిమధ్యనొక అద్దమునమర్చి, దానికి పొందికగా మూతనమర్చి, దానియందే అలంకరణ సామగ్రియిముడు నట్లును, చేతికనువుగనుండి మనోజ్ఞమగు శిల్ప చాతుర్యముగల ఆ దర్పణమును చూచి దానిపై మనసుపడెను.

రాజకుటుంబ రక్షకుడుగా సపరివార సమేతుడై తోడువచ్చిన సూరన మంత్రి రాజకుమారి మనసెరిగినవాడై, ధర్మపానునిచేరి ఆచార్యా! మా రాకుమారి మీ శిల్ప నైపుణ్య ప్రతిభతో సృష్టించబడిన ఆ శృంగార దర్పణముపై మనసు పడినది కనుక దానిని మా రాజకుమారికి కానుకగా సమర్పింపుడనెను. అందుకు ధర్మపాలుడు మంత్రిశేఖరా! మేము దేశమునందెల్లెడ కాంశ్యవస్తు విక్రయమొనర్చుచుంటిమి. మా శిల్ప విజ్ఞతకు, హస్తకళా కౌశలమునకును మెచ్చి, ముగ్ధులై భూవలయమునగల భూపతులు సంపన్నులు, మమ్ములను సన్మానించి సమాదరించుచున్నారే గాని, కానుకగా ఇమ్మనిన వారులేరు. అదియునుగాక శ్రీమంతులైన మీవంటివారికి కానుకగా నొసంగుట మా శిల్పశాలా నియమములకు విరుద్ధము. కనుకు మూల్యమును చెల్లించి ముకురమును సరియగు వెలకు కొనుడు. అని పల్కిన మంత్రి వర్యుండిట్లనియె.  కళానిధి అభీష్టము ప్రకారము మా ప్రభువులకు విన్నివించి మూల్యము నిప్పింపగలము. ప్రభువుతో మీకు పరిచయమును కల్పింతుము. మీరు సభకురండు అని పల్క ధర్మపాలుండు తనకుమారుడగు రుద్రసేనుని రాజసభకంపెను.

కుత్థ్సిత బుద్ధియగు ఆమంత్రి రాజువద్ద కరిగినవాడై ప్రభూ! మన కాంచీపురమునకు కాంశ్యకారులగు వ్యాపారుల బృందమొకటి వచ్చి వస్తువులను విక్రయించుచున్నారు. నేడు రాజకుమారి ఆలయమునకేగి వచ్చుచు మార్గమధ్యమున నున్న ఆ యంగడిలోని ఒక అద్దముపై ముచ్చట పడినది. వెలయివ్వనిదే ముకురమును ముట్టరాదని వారలనిరి. అద్దములేకున్న అంతఃపురి రానని రాకుమారిగారు హటము వేసిరి. ఇట్టి స్థితిలో మూల్యమును చెల్లింతుమని పల్కి ఆ విశ్వకర్మకులుని వెంటనిడుకొని వచ్చితిని. అద్దము అమ్మాయిగారి సదనమున జేర్చి ఈ విషయమును మీ కెరింగింప వచ్చితిని. వీడు ధనమునకై వచ్చి దయ్యమువలె నా వెంటబడి తిరుగుచు వేధించుచున్నాడు.

వీడు అమ్మెడు కంచుపాత్రలకు ఎత్తుకు రెండెత్తుల బంగారము చొప్పున వెలయట! మన నగరమునగల బంగారము నంతయు దోచుకొనుచున్నారు. ప్రభూ! వారడిగిన వెలయిచ్చి పంపమందురా! తమ ఆజ్ఞ - సెలవిండు అని మంత్రి పలుక, చోళభూపతి కోపమున మంత్రినుద్దేశించి, ఇట్లనియె - ఏమీ కమ్మరవాని కింత కండపొగరు? ఏదీ వానినిటు రమ్మనుడని అతని సభకు రప్పించి, ఏమిరా కాంశ్యాకారాధమా ముచ్చటపడి మా కుమారి కోరినదే తడవుగా మహా ప్రాసాదమని సమర్పించు కొనుటకు మారు మూల్యము నిమ్మనుచున్నారా? అటయిన ఇదివనుము. వ్యాపారార్థము మా నగరమున సరుకుల నమ్ముకొన్నందుకు సుంకమును చెల్లింపుడు. సుంకములేని వ్యాపారమెందైనను గలదా? కనుక సుంకము చెల్లించి రాజానుమతిని పొంది మీ వ్యాపారము సాగింపుడని పలుకగా, రుద్రసేనుడిట్లనియె.

అయ్యారే! ఇదెక్కడి న్యాయము మహారాజా, ఆసేతు శీతాచల పర్యంతము మమ్మిప్పటి వరకు సుంకమడిగిన రాజులు కానరారు. మా కళా నైపుణ్యమునకు మెచ్చి మమ్ము గౌరవించి సన్మానించి, మా వ్యాపారమును ప్రోత్సహించిరేకాని, మమ్ము సొమ్ములడిగినవారు లేరు. జగతికి కళలే మూలాధారములు. ఆ కళలను, కళాకారులను, అగౌరవించిన రాజులుగాని, రాజ్యముగాని, అర్థవిహీనులై, దరిద్రముల కాటపట్టులగును.

వెల ఇచ్చెదమని నమ్మించి మోసగించుట తగదు. యీ దుష్కృత్యముతో మీరు అపకీర్తి పొందుదురు. అని పలుకగా, రాజు ఉగ్రుడై సైన్యాధ్యక్షునితో నిట్లనియె.

దండనాయకా, వీడెంత పొగరుబోతు. శిల్పులు మన ఊరలేరా? ఇట్లెవరైన మర్యాదదప్పి మసలినారా ? ఈ  రాజధిక్కారమునకు వీనిని కొట్టుడు, తిట్టుడు, తన్నుడు, తలదీయుడని ఆజ్ఞాపించెను.

రాజాజ్ఞను శిరసావహించి తన పై బడి వచ్చు సాయుధులగు సైనికులపై కోపించిన రుద్రసేనుడు తనచేతనున్న 'తూచుకోలను' మంత్రించి ప్రయోగించెను. యంత్ర సహితమును, మంత్రపూరితమును అగు ఆ 'తూచుకోల' ఇంతింతై, అంతై మహామారణాయుధమై విజృంభించి ఆ సైనికుల నందరను దునుమాడెను. తూచుకోల సాయమున తానొక్కడే సేనాసమూహముల నిర్జించి సురక్షితముగా తండ్రిని జేరి సంగతిని సవిస్తరముగా నెరింగించెను.

మంత్రశాస్త్రసిద్ధుడు, దివ్యాస్త్ర ప్రయోగ ప్రవీణుడు అయిన రుద్రుసేనునిచే తుత్తునియలై పడిన తన సైనికుల పాటునకు రజ్జితుడైన రాజుతో దుష్టబుద్ధియగు సూరనామాత్యుడు, రాజా! విదేశ వ్యాపారులగు కాంశ్యకారులచే భంగపడుట మన రాజరికమునకే అవమానకరము. కనుక యుద్ధమొనర్చియైనను ఆ కంచరుల సంఘమును సమూలముగా నాశనమొనర్చకున్న అపకీర్తి పాలగుదుము అని పొగవేయజొచ్చెను. హితైషులగు ఇతర మంత్రులు మహారాజా వ్రేలు నలిగిన రోలంతైనది, రోలు నలిగిన ఇంకెంతగునో కదా, వృధావైరమున మన సైనికుల ప్రాణములు, మనకు ధనమును నశించును గదా యని బోధించిరి. కానీ దుష్ట చిత్తులగు మంత్రులు, మహారాజా, ఇప్పుడు మనము వెనుకంజవేసిన అసమర్థుల మనుకొనరా? ఇంతయై ఇప్పుడు అద్దమునకు మూల్యమిచ్చిన అవమానము కాదాద, ఈ సంగతి తెలిసి శతృవులు విజృంభింపరా?పరరాజులు పకపక నవ్వరా? అని సంగరోత్సాహమును కల్పించి యుద్ధసన్నద్ధలైరి.

సమరోత్సాహులై తమపై విజృంభించి వచ్చువారికి ధర్మపాలుడు వినయముగా సందేశమంపెను. మహారాజా! గోటబోవు దానిని గొడ్డట నరుకబోవుచున్నారా? యుద్దము సర్వానర్థములకు మూలము. అద్దము మూల్యమునకన్న సైన్యముల మూల్యము తక్కునని అనుకొంటిరా? దుష్టుల దుస్తంత్రములను విని కీడును కొని తెచ్చుకొనకుడు నిదురించు సింహముల తట్టిలేపుట తగదు. గుట్టుగా జీవించు ప్రజల కష్టముల పాలొనర్పకుడు అని సందేశమంప పెడచెవినిడి సంగరమునకే సమాయత్తపడుచున్న రాజానుమతం బెరిగిన ధర్మపాలుడు కుమారుల చేరబిలచి, నాయనలారా! రాజునకు కాలము చేరువైనది. మీరు యుద్ధమునకు సిద్దముకండు అని పలుకు వారు సర్వాస్త్ర శస్త్రముల ధరించి, ఆదిదేవుడగు శ్రీ విశ్వకర్మ భగవానునికి కృతాంజలులై ధ్యానించిరి.


పంచబ్రహ్మాత్మకుడైన ఆ విశ్వకర్మభగవానుని, సర్వాస్త్ర పటిష్టతమొనర్చి, ఆవాహనమొనర్చి, ధ్యానించి, కులదైవమగు కామాక్షీదేవిని జయకాంక్షులై పూజించిరి. కొదమసింగములై కదనభూమినిజొచ్చి విజృంభించి సర్వసైనికులను చిన్నాభిన్నమొనర్చి యుద్ధభూమిని పీనుగుపెంటలొనర్చిరి. రుద్రసేనుడు తులాదండమును మంత్రించి ప్రయోగింప సంగరభూమి సర్వమును నాశనమొనర్చిరి. చావగా మిగిలినవారు పలాయన మంత్రము పఠించిరి. విజయులై వచ్చిన విశ్వకర్మీయులు కామాక్షి దేవిని పూజించిరి.

సర్వముశూన్యమై దిక్కుతోచని స్థితినోనున్న మహారాజును సమీపించిన దుష్టబుద్ధఇయగు సూరనమంత్రి, మహారాజా అధైర్యపడకుడు. ఆ రుద్రసేనాదులు మంత్రవేత్తలు యుక్తిపరులు. వారిని భుజబలమున జయించుట అసాధ్యము. కనుక ధీశక్తిగల మన శంకరాచార్య గురుదేవుడు మనవిజయమునకు మార్గము నెరింగింపగలడు. మనరాజకుటుంబ శ్రేయోభిలాషియగు ఆ గురుదేవుడు ఆ విశ్వకర్మజుల కత్యంత సన్నిహితుడు, ప్రియస్నేహితుడు, పూర్వపరిచితుడు, వారి ఆనుపానులెరిగినవాడు. కనుక శంకరాచార్య గురుదేవునాహ్వానింపుడని పలుక శ్రీశంకరులు సగౌరవముగనాహ్వానించి సఖాసీనునొనర్చి, తమ ఆపద  నెరింగించి, ఆ కాంశ్యకారవీరులను గూర్చి చరిత్ర, రహస్యములు మీరెరుగనివి కావు. ఇప్పుడున్న స్థితిలో రాజ్యరక్షణము గురుపీఠముల ప్రధానకర్తవ్యము గదా, సర్వజ్ఞులైన మీరు ఆ విశ్వకర్మాన్వయున వధించునుపాయమెరింగించి రాజ్యమును రక్షింపుడని వేడుకొనెను.

చోళరాజేంద్రా, ఆ మనుకులాచార్యుల యుద్ధమున జయించుట జరుగనిపని, తులాదండము వారి చేతనున్నంత వరకు బ్రహ్మరుద్రాదులకైనను శక్యముగాదు.

శుక్రవారము నాడు వారు సర్వాయుధములు, సమస్త వస్తువులు పూజాగృహమందుంచి పూజింతురు. మరునాడు ఉద్వాసన మొనర్చి వానిని ముట్టుదురు. శుక్రవారమునాడు మాత్రము వారు నిరాయుధులు. ఆ రోజున వారిని సామోపాయమున సభకు రప్పించి సంధియొనర్చుకొనుడు. నీవు నా ప్రియశిష్యుడవగుటచే నీ రహస్యము చెప్పి వారిని వశమొనర్చుకొను ఉపాయమెరింగించితిని. వీరులగు నా బ్రహ్మవంశీయున తో నీవు నయమున చెలిమి యొనర్చుకొమ్ము, అటుగాక కీడు తలపెట్టితివా నీకును నీరాజ్యమునకును సకలారిష్టములు సంభవింపగలవు అని పలికి తన ఆశ్రమంబునకరిగెను.

అంత రాజు కొందరు అమాత్యుల నియోగించి, మీరు జగద్గురు వంశజులైన శిల్పులవద్ద కరిగి, జరిగినదానిని మరచిపొండనియు మీ దర్పణమునకు మీరుకోరిన హేమమిచ్చెదమనియు మీయెడ మేమొనర్చిన తప్పిదమునకు క్షమాపణగా మిమ్ముసభాముఖమున సన్మానింతమనియు, మా మాటలుగా చెప్పి వారిని శుక్రవారమునాడు సాదరముగా తోడ్కొనిరండు అని పంపగా వారు వెళ్ళి ధర్మపాలునికి నమస్కించి, రాజసందేశమును వినిపించిరి.

ఆ వాక్యములకు సంతసించి ధర్మపాలుడు సంధికి సిద్ధమై కుమారుల మువ్వురను కొలువుకూటమునకంపెను. నిరాయుధులై వచ్చు వారలకు ఎదరేగి ఆహ్వానించి కుశలమడిగి, వారలకు విడిదిమందిరముల ఏర్పాటు గావించెను. సన్మానమొనరింప సభనలంకరింపుడని నాజ్ఞయొనంగెను. ఆ వీరుల నభ్యంగనాదులొనర్పుడని జట్టిల నియమించెను.

నిరాయుధులై, అర్థ వస్త్రధారలై, తైలమర్ధనమొనరించుకొనుచున్న ఆ శిల్పులను భటులు చుట్టుముట్టి బంధించిరి. కంఠములోతు గోతులు త్రవ్వి వారినిదించి కంఠములు మిగులు నట్లు బూడ్చి ఘోరముగా హింసించుచు కుత్తుకలు గోసి చంపిరిం.

శిరంబు కోయగనే తెగి ఆ శిరస్సులు మూడు భయంకరాకారమున ఆకాసమున కెగిరి పట్నమెల్ల సంచరింపదొడగెను. పట్టణమెల్ల రక్తధారలు కరిసెను. ఉత్పాతములు చెలరేగెను. భూమి కంపించెను. గ్రద్దలు మింట గుమిగూడి యాడెను.

ఈ అకాల భయవాతావరణమునకు ప్రజలు తల్లడిల్లిరి. ధర్మపాలుడు ఆశ్రమస్థలి జేరి శంకరాచార్యునొద్దకు జని దుఃఖించుచుండెను. వ్యాకుల చిత్తుడగు ఆ ధర్మపాలుని శంకరాచార్యుడోదార్చెను.

వారిరువురు కామాక్షి ఆలయమునకేగి కామాక్షీ దేవిని స్తుతించిన, ఆ తల్లి ప్రసన్నయై ధర్మపాలునోదార్చి, వరమడుగగా, దుఃఖోపశమనము పొంది ధర్మపాలుడు ఇట్లనియె. తల్లీ జగదాంబా!

దేవీ కటాక్షమున రుద్రనేనాదులు పునర్జీవితులైరి. కామాక్షీ దేవి పాదపీఠమున వారిశిరంబులు చేర్చునట్లు ఆశీస్సులనందిరి.

Saturday, January 9, 2010

౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవ విశేషాలు

స్వరాజ్యమైదానం లో ౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా మొదలయ్యింది.
ప్రతి సంవత్సరం జనవరి ౧ నుంచి ౧౧ వరకు జరుగుతుంది.
విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుండి పుస్తక ప్రియులు ఇక్కడికి వస్తుంటారు.

సాహిత్య, పాఠ్య, శాస్త్ర సంబంధిత, ఇంకా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి.
ఒక సాహిత్యవేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ సాహిత్యవేదికకు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పేరు పెట్టారు.

ఈ పుస్తకమహోత్సవ నిర్వాహకులు, తమ స్వంత ఖర్చులతో సుమారు 40,000 పుస్తకాలతో ఒక గ్రంథాలయన్ని నడుపుతున్నారు.


నేను రెండు రోజులు వెళ్ళాను. అక్కడ జరిగిన విషయాలను మీతో పంచుకోవాలని.... నాకు గుర్తున్నంత వరకు, అర్థమైనంత వరకు రాస్తున్నాను, ఏమైనా తప్పులుంటే అవన్నీ నావే...


గొల్లపూడి గారిని చూడటం, రావూరి భరద్వాజ, మృణాళిని గార్లతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది.


మొదటి రోజు
విజయవాడ మేయర్, జిల్లా కలక్టర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారూ, తమిళ కవి పొన్నీలన్ గారూ విచ్చేసారు.

గొల్లపూడి గారు:
కృష్ణా జిల్లా భాషనే పత్రికలలకు ప్రామాణికం అని చెప్పారు. కృష్ణా పత్రిక సంపాదకులు, ఇంకా మొదటి తరం సంపాదకులు చాలా మంది కృష్ణా ప్రాంతీయులు కావటమే కారణం అని చెప్పారు.

ఎంతో మంది తమిళ కవులు తెలుగు భాషను తమ మాధ్యమం గా వాడుకోవటనికి కారణం, భక్తి కి తెలుగు భాష బాగా సరిపోతుంది.
తమిళ కవులు తెలుగు భాషలో వ్రాసిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని, పబ్లిషర్లకు విజ్ఞప్తి చేశారు.

పొన్నీలన్ గారు:
'సుందర తెలుంగు' అని తమిళకవి సుబ్రహ్మణ్య భారతి పొగిడారు. (అందమైన కేరళ స్త్రీలు, సుందర తెలుంగు పాటను పాడుకుంటూ వెళ్తున్నారు.)
ఇప్పటికీ తమిళనాట, సంగీతం నేర్చుకొనే వారు తెలుగు పాటలతోనే మొదలుపెడతారు. తెలుగు భాష మమ్మల్ని పాలిస్తున్నది అని చెప్పారు.
తెలుగువారు, తమిళులు సాహిత్యపరంగా కూడా ఇచ్చిపుచ్చుకోవటం జరగాలని కోరారు.

రెండవ రోజు
గోపీచంద్ గారి శతజయంతి ఉత్సవాన్ని జరిపారు. వారి కుమారులు అధ్యక్షత వహించగా, రావూరి భరద్వాజ గారూ, మృణాళిని గారూ అతిథులు గా విచ్చేసారు.

రావూరి భరద్వాజ:
భరద్వాజ గారికి ఆకాశవాణిలో ఉద్యోగం ఇప్పించింది గోపీచంద్ గారే. భరద్వాజ గారు గోపీచంద్ ని గోపన్న అని పిలిచేవారు.
భరద్వాజ గారి మాటల్లో,
నాకు అన్నం గారిని, అక్షరం గారిని దగ్గర చేసింది గోపిచంద్. నాకు పంక్చువాలిటి నేర్పింది కూడా గోపన్నే.
ఓ రోజు కాంతమ్మ(భరద్వాజగారి సతీమణి) గారికి వొంట్లో బాగుండక పోతే ఆస్పత్రి కి తీసుకెళ్ళి, ఆఫీసుకెళ్ళే  సరికి ఆలస్యమైంది.
ఏం భరద్వాజా, ఆలస్యమైందేం అని గోపన్న అడిగాడు. కారణం చెప్పాను. టీ తాగుదామని అలా బయటకి తీసుకువెళ్ళాడు గోపన్న.
భరద్వాజా, మొన్న ఆ రాష్ట్రంలో భూకంపం వచ్చింది కదా! చాలా జననష్టం, ధన నష్టం జరిగింది కదా అన్నాడు. అవును అన్నాను. ఇలాంటివి రెండు మూడు సంఘటనలు చెప్పాడు.
మరి ఇంత నష్టం జరిగిందని ఆకాశవాణి వాళ్ళు నీకు ఏమైనా జీతం తగ్గించారా అని అడిగాడు.
ఆ రోజు నుంచి నేను ఇంత వరకు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు. చివరికి కాంతమ్మ గారు చనిపోయినప్పుడు కూడా..

మృణాళిని గారు:
మృణాళిని గారు మంచి వక్త. గోపీచంద్ గారి సాహితీ పయనాన్ని అనేక కోణాల్లోంచి తెలియచేశారు.
మిగతా కవులకూ, గోపీచంద్ గారికీ వున్న తేడాని ఇలా తెలియచేశారు.
గోపీచంద్ ముందు నాస్తికుడిగా, ఆస్తికుడిగా ఇలా మారుతూండటాన్ని చాలా మంది విమర్శించారు.
రచయితలందరూ ఒక భావానికో లేదా ఆదర్శానికో బద్ధులై వుంటారు. దానికనుగుణంగా తమ రచనలు కొనసాగిస్తుంటారు.
నిబద్ధత వున్న రచయితలు తమ భావాలు తప్పైనా వాటినే కొనసాగిస్తారు.
గోపీచంద్ నిజాయితీ వున్న రచయిత. కాలంతో పాటు తన భావం తప్పు అని తెలిస్తే, తన భావాల్ని మార్చుకొని రచనలు చేసేవారు.

Sunday, December 13, 2009

హిందూ ధర్మప్రచారము - ౧ (తి.తి.దే)

భారతీయ బాలబాలికలకూ, యువతీ యువకులకూ, మన సనాతనధర్మంపట్ల ఆ సనాతన ప్రవచించే వేదపురాణ శాస్త్ర కావ్యవాజ్ఞయంపట్ల ఆసక్తి పెంచటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రయత్నం లో ఓ భాగం

వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, స్మృతులు, ఇతిహాసములు

వేదములు

హిందూధర్మమునకు వేదములే మూలము.వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటే ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపడినవి.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండయనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాదికర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.

ఒక్క పరబ్రహ్మను తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపములు నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.

మంత్రద్రష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలు కారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పడినవి.

వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజించి తన శిష్యులగు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనువారికి బోధించెను. పిమ్మట వారు గుర శిష్య పరంపరగా వదములు ఒక తరము నుండి కరొక తరమునకు సంక్రమిచుచు వచ్చినవి.

మానవులు భ్రమప్రమాదములకు లోనగుట సహజము. అందుచే వారి మాటలలో తప్పులు దొరలుట కవకాశము గలదు. వేదములు అపౌరుషేయములు గాన నిర్దుష్టములై యున్నవి.

ఉపనిషత్తులు

వేదములుయొక్క చివరిభాగములే ఉపనిషత్తులు. వేదశాఖలు అనేకములు గావున ఉపనిషత్తులు గూడ అనేకములు గలవు. అందు ౧౦౮ ఉపనిషత్తులు ముఖ్యములు. అందును పది ఉపనిషత్తులు మిక్కిలి ప్రధానములై యున్నవి.

ఈశ కేన కఫ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా.

౧. ఈశావాస్యోపనిషత్తు ౨.కేనోపనిషత్తు ౩. కఠోపనిషత్తు ౪. ప్రశ్నోపనిషత్తు ౫. ముండకోపనిషత్తు ౬ మాండూక్యోపనిషత్తు ౭ తైత్తిరీయోపనిషత్తు ౮ ఐతరేయోపనిషత్తు ౯ ఛాందోగ్యోపనిషత్తు మరియు ౧౦. బృహదారణ్యకోపనిషత్తు - అనునవి దశోపనిషత్తులు.

వేదాంతసంప్రదాయములో దశోపనిషత్తులు పరమప్రమాణములు గావున ఆచార్యాలు తత్త్వమును ప్రతిపాందిచునుపుడు మాటిమాటికి ఉపనిషత్తుల నుదాహరించిరి. ఉపనిషత్తులలోని సిద్ధాంములే సంగ్రహముగా భగవద్గీతయందును, బ్రహ్మసూత్రములలోను వివరింపబడినవి.

వేదాంగములు
శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా,
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

౧.శిక్ష ౨. వ్యాకరణము ౩. ఛందస్సు ౪.నిరక్తము ౫.జ్యోతిషము ౬.కల్పము అనునవి యారును వేదమునకు అంగముజగుచున్నవి. వేదార్థమును తెలిసికొనుట కివి మిక్కిలి యుపకరించును.

శిక్ష

పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదముము ఉచ్చరింపవలసిన పద్ధతిని బోధించును. వేదములలో స్వరము మిక్కిలి ముఖ్యము. స్వరమును గూర్చిన విశేషములన్నియు ఈ శాస్త్రములో చక్కగా నిరూపింపబడినవి.

వ్యాకరణము

వ్యాకరణశాస్త్రమును గూడ సూత్రరూపమున పాణినియే రచించెను. ఇందు ఎనిమిది అధ్యాయములు కలవు. ఈమహాశాస్త్రమును మహేశ్వరుని అనుగ్రహముతో ఆయన రచించెనని చెప్పుదురు. దోష రహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమము లన్నియు ఈ శాస్త్రములో విశదీకరింపబడినవి. పాణిని వ్యాకరణసూత్రములే ఆధునికి భాషాశాస్త్రమునకు మూల మని భాషాశాస్త్రవేత్తలు చెప్పుదురు.

ఛందస్సు

పింగళుడు "ఛందోవిచితి" అనబడు ఎనిమిది అధ్యాయముల ఛందశ్శాస్త్రమును రచించెను. వేదమంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకికఛందస్సులు గూడ ఇచట నిరూపింపబడినవి.


నిరుక్తము

నిరుక్తశాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల యొక్క వ్యుత్పత్తి ఇందు బోధింపబడినది. వేదార్థమును గ్రహించుట కీ శాస్త్రము మిక్కిలి ఉపయోగపడుచున్నది. పదములన్నియు ధాతువు నుండి పుట్టిన వని యాస్కుని అభిప్రాయము.

జ్యోతిషము

వేదములు యజ్ఞములు చేయవలయునని బోధించుచున్నవి. నియత కాలములందే ఆ యజ్ఞములను చేయవలెను. ఆ కాలనియమమును బోధించు శాస్త్రమును 'జ్యోతిష' మందురు. లగధుడు, గర్గుడు మున్నగువా రీ శాస్త్రగ్రంథములను రచించిరి.


కల్పము

సూత్రరూపమున నున్న కల్పశాస్త్రము యజ్ఞయాగాదుల విధానములను, అందలి భేదములను వివరించుచున్నది. ఆశ్వలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును ప్రవర్తిపజేసిరి.


వచ్చే వారం - ధర్మశాస్త్రములు, స్మృతులు, ఇతిహాసములు.




Saturday, December 12, 2009

పాపాయి కి నామకరణం చేయటానికి మంచి పేరు(రె,రే,రొ,రో,త) సూచించండి

నాకు తెలిసిన వారి పాపాయికి నామకరణ దినోత్సవానికి మంచి పేరు సూచించండి.
పాపాయి అక్టోబరు 19, ఉదయం 4:10నిముషాలకు జన్మించింది. నక్షత్రం స్వాతి. పాదం తెలియదు. తెలుపగలరు.
బాలిక పేరు రె,రే,రొ,రో,త అక్షరాలతో మొదలవ్వాలి అని చెప్పారు.
నక్షత్రం, పాదం ప్రకారం ఇంకా ఏదైనా అక్షరాలతో పేరు పెట్టవచ్చా...

నాకేమో మంచి పేర్లు తట్టటం లేదు. అందకే మీ సహాయం కోసం బ్లాగులో వుంచాను.
తెలుగు, సంస్కృతం లో ఏ పేరైనా అందంగా ఉండేట్లు చూడండి(మూడక్షరాలకు పైబడి).
 రేఖ, రేవతి, రోహిణి, రోజ ...
ఇంకా...

Friday, December 11, 2009

సమైక్య ఆంధ్ర కోసం తోడ్పడండి

రాష్ట్రపతి కి పంపే నివేదిక లో మీరూ పాలు పంచుకోండి

http://www.petitiononline.com/Ap111/petition.html
http://www.petitiononline.com/1andhra/



మళ్ళీ ఓ సారి గుర్తుకుతెచ్చుకుందాం

తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది - రాయలసీమ నాది
సర్కారు నాది - నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా!

ప్రాంతాలు వేరైనా - మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న - మన భాష తెలుగు బాసన్న
వచ్చిండన్న వచ్చాడన్నా - వరాల తెలుగు ఒకటేనన్న

ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటె కనుగ్రుడ్డు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు.

Sunday, December 6, 2009

ఋగ్వేద రహస్యాలు





పుస్తకం కోసం ఇక్కడం క్లిక్ చేయండి: ఋగ్వేద రహస్యాలు