ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అగస్త్యుడు

శ్రీ రామరక్ష :

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై
భీముడు తిన్న పండివంటలు జీర్ణమై
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై
అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై
కుంది లాగా కూర్చొని
నంది లాగా లేచి
తాంబేలు లాగా తాళి
చల్లగా ఉండాలి
శ్రీరామ రక్ష
నూరేళ్ళాయుస్సు

తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు

బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు.

తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది.


ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది.

జననం:

           అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది.

ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు తన కులపురోహితుడైన వసిష్ఠ మహర్షితో "నేను ఒక యాగం సంకల్పించాను. ఆధ్వర్యులుగా వుండి మీరాయజ్ఞం జరిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి" అని వేడుకుంటాడు. అందుకు వసిష్ఠుడు 'రాజా! దేవేంద్రుడు ఇంతకుమునుపే తన యాగానికి నన్ను హోతగా నియమించాడు. అది పూర్తి కాగానే వచ్చి మీ క్రతువు నిర్వహిస్తాను. అంతవరకు కొంచెం ఓపికపట్ట' మని చెప్పి వెళతాడు.

సవనానికి కావలసిన సర్వపదార్ధాలూ సమకూర్చుకొని వుండటం చేత నిమి చక్రవర్తి ఆయన వచ్చేవరకు తాళలేక గౌతమమహర్షిని పురోహిునిగా నియమించి, అత్రి చ్యవనాది ఋషులను ఋత్విక్కులుగా పరిగ్రహించి సత్రయాగం సాగిస్తుంటాడు.

గురశిష్యుల శాప ప్రతిశాపాలు
ఇంద్రయాగం పరిసమాప్తి చేసి వసిష్ఠుడు వస్తాడు. ఇక్కడ నిమి చక్రవర్తి యజ్ఞం జరుగుతూ వుంటుంది. అది చూడగానే వసిష్ఠునకు ఒళ్ళు భగ్గుమంటుంది. 'గురుణ్ణి నన్ను తిరస్కరించి మరొక్కని గురువుగా స్వీకరిస్తాడా? ఏమి వీని కండకావరం! ఇతని పొగరణుస్తాను' అంటూ వసిష్ఠుడు యాగశాలలోకి ప్రవేశిస్తాడు.

బడలికవల్ల పగటిపూటనే ఒకచోట నిదురిస్తున్న నిమిని గ్రుడ్లురిమి చూస్తూ  నన్ను నిర్లక్ష్యం చేసిన నేరానికి నీవు శరీరం విడుతువు గాక! అని శపించి ధిక్కరిస్తాడు.

నిమి నిద్రమేల్కొని 'నేను నీ శిష్యుణ్ణి. నిరపరాధిని. వృథాగా నన్ను శపించావు. దురాత్ముడవైన నీవుకూడా నాలాగానే దేహం వీడుదువు గాక!' అని గురువుకు ప్రతిశాప మిస్తాడు. ఇలా గురుశిష్యులు పరస్పరశాపాల వల్ల విదేహులవుతారు.

వశిష్ఠులు దుఃఖంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి 'నిమి శాపం మూలాన నా స్థూలదేహం నశించింది. సూక్ష్మశరీరంతో మీ పాదాల దగ్గరికి వచ్చాను. నాకు స్థూలకాయం ప్రాప్తించే ఉపాయం చెప్పిండి' అని దీనంగా వేడుకుంటాడు.

విరించి కరుణించి 'నీవు మిత్రావరుణుల తేజస్సులందు యోగవిద్యాబలంతో ప్రవేశించి మళ్ళీ దేహాన్ని ధరించు' మని పలికి పంపుతాడు.

ఒకనాడు మిత్రావరుణులు సాగరతీరాన సంచరిస్తూ త్రిలోక సుందరియైన ఊర్వశిని తిలకిస్తారు. వారివురి తేజస్సును అప్సరస ఒక కలశంలో వుంచుతుంది. ఆ కలశం నుంచి వసిష్ఠుడు, అగస్త్యుడు ఉద్భవిస్తారు.

కుంభం నుంచి జన్మించడంచేత కుంభసంభవుడు, మిత్రావరుణుల పుత్త్రుడవండం వల్ల మైత్రావరుణి, ఊర్వశి నందనుడు కాబట్టి ఔర్వశేయుడు అనే పేర్లతో అగస్త్యుడు ప్రశస్తి వహిస్తాడు.

లోకహితార్థం ఆయన చేసిన ఘనకార్యాలు అనన్యసాధ్యాలు, అత్యద్భుతాలు. ఆయన ఆకారంలో పొట్టివాడు. కాని శక్తి సామార్థ్యాలలో, బుద్ధి చాతుర్యంలో గట్టివాడు. వాతాపిదైత్యుని గుట్టుగ దిగమ్రింగి గర్భగోళంలో జీర్ణించుకొన్న మహానుభావుడీయన.

వాతాపీ! బయటికి రా!

మణిమతీపురంలో ఇల్వలుడు, వాతాపి అనే అన్నదమ్ములుండేవారు. వాళ్ళు రాక్షసులు. క్రూరకర్ములు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని భక్తితో ఆరాధించి అన్ని కోరికలు సిద్ధింపజేసే మంత్రాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తాడు. విప్రుడు తిరస్కరిస్తాడు. అందుచేత ఇల్వలుడికి ఆయన మీద పట్టరానంత ఆగ్రహం కలుగుతుంది. అతనితోపాటు బ్రాహ్మణజాతినంతా సర్వనాశనం చెయ్యాలని వాడు సంకల్పిస్తాడు.

దానవులు కామరూపులు గనుక ఇల్వలుడు విప్రవేషం ధరించి సంస్కృతభాష మాట్లాడుతూ భూసురులను అనుదినం భోజనానికి ఆహ్వానించేవాడు. మేకగా మారిన వాతాపిని వధించి వాని మాంసం చక్కగా వండించి ఆ వచ్చిన అతిథులకు వడ్డించేవాడు. వారు కమ్మగా ఆరగించిన తర్వాత ఇల్వలుడు తృప్తి అయిందా అని అడిగి 'వాతాపీ! బయటికి రా!' అని బిగ్గరగా తమ్ముణ్ణి పిలిచేవాడు. పిలుపు వినగానే వాడు పునర్జీవితుడై మేకలాగా మే, మే అని అరుస్తూ భోక్తల పొట్ట చీల్చుకొని వెలుపలికి వచ్చేవాడు. అతిథులు హరీ అని అసువులు విడిచేవారు. ఇలా ఎందఱో అమాయకులు హరీ అన్నారు.

అగస్త్యుడు బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి చాలాకాలం దారుణమైన తపస్సు చేస్తాడు. అడవుల్లో సంచరిస్తూ అతడొక రోజు చెట్టు కొమ్మ నుంచి తలక్రిందుగా వ్రేలాడుతున్న వ్యక్తుల్ని చూసి విస్తుపోయి 'మీరెవరు? ఎందుకిలా వ్రేలాడుతున్నారు?' అని ప్రశ్నిస్తాడు.

వారు 'అయ్యా! మేము మీ పితరులం. నీవు పెళ్ళి చేసుకొని బిడ్డలను కనకుండ బ్రహ్మచారివై తపస్సు చేస్తున్నావు. అందువల్ల ఊర్ధ్వగతులు చెడి మేమిలా అల్లాడుతున్నాం. ఇప్పిటికైనా నీవు పెళ్లాడి కొడుకులుగంటే మాకు అధోగతులు తొలగి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి' అని విచారంతో చెబుతారు.

అగస్త్యుడు అందుకంగీరించి సంతానార్థియైన విదర్భరాజుకు తన తపశ్శక్తి చేత ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆమె పేరు లోపాముద్ర. నీటిలో తామరవలె, అభ్యాసనపరునియందు విద్యవలె ఆ బాలిక దిన దినాభివృధ్ధి పొందుతుంది. రూపవతియైన లోపాముద్ర పెరిగి పెల్ళి యీడుకు రాగానే విదర్భేశ్వరుడు తనయకు తగిన వరుణ్ణి అన్వేషిస్తుంటాడు.

అంతలో అగస్త్యుడు అతని దగ్గరకు వచ్చి తనకు లోపాముద్రనిమ్మని అడుగుతాడు. విదర్భపతి మునికోరిక విని 'నారబట్టలు ధరించి, కందమూలాలు భుజిస్తూ, అడవుల్లో ఘోరమైన తపస్సుచేస్తూ కృశించియున్న ఈ బ్రాహ్మణుడు సుకుమారియైన నా సుతను పెళ్ళాడి ఏమి సుఖపెడతాడు? భోగాలనుభవించదగిన కన్యను తెలిసి తెలిసీ ఈ యతికి ఎలా ఇవ్వను? ఇవ్వకుంటే వూరకుంటాడా? శపిస్తాడు గాని సహింపడు. దైవమా! ఏమి గతి!' అని లోలోపల కుములుతుండగా లోపాముద్ర తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ఈ మునీంద్రుడుకి నన్ను ప్రీతితో ఇచ్చి పెళ్ళిచేయండి అని నచ్చచెపుతుంది. వారు వైభవోపేతంగా అమ్మాయిని అగస్త్యున కిచ్చి వివాహం చేస్తారు.

అగస్త్యుడు లోపాముద్రను పరిగ్రహించి ఆమె ధరించిన దివ్యాంబరాలనూ, ఆభరణాలనూ అప్పటి కప్పుడే విసర్జింపజేసి, నారచీరలు కట్టించి గంగాద్వారం చేరుకుంటాడు. అక్కడ తపస్సు చేస్తుండగా మునికి సంసారాభిలాష కలుగుతుంది.

లోపాముద్ర భర్తను చూసి 'నాథా! నాకు అందమైన చీరలు సుందరమైన నగలు తెచ్చియివ్వండి' అని కోరుతుంది. అగస్త్యుడు ధనం కోసం తపశ్శక్తిని వృథా చేయడం ఇష్టం లేక శ్రుతపర్వుడనే రాజును ధనం కోసం ఆశ్రయిస్తాడు.

ఆ రాజు తనకు ఆదాయవ్యయాలు సమానం కావడం వల్ల మిగులు ధనం లేదని తెలిపి, అగస్త్యుని బ్రధ్నస్యుడనే ప్రభువు దగ్గరికి తీసుకువెళతాడు. బ్రధ్నస్యుడి పరిస్థితి అలాంటిదే అని తెలుసుకొని, ముగ్గురూ త్రసదస్యుడనే జనపతి దగ్గరకు పోతారు. త్రసదస్యు డగస్త్యునితో 'ఈ మణిమతీ నగరంలో ఇల్వలుడనే దైత్యుడు వాతాపి అనే తమ్ముడితో వుంటున్నాడు. ఈ లోకంలో అందరికన్నా వాడే గొప్ప ధనవంతుడు. అతడు మన అభీష్టాన్ని తప్పక నెరవేర్చగలడు' అని అంటాడు.

రాజర్షులు ముగ్గురూ మహర్షిని వెంటబెట్టుకొని ఇల్వలుడి దగ్గరికి వెడతారు. ఇల్వలుడు వారిని అర్ఘ్యపాద్యాలతో అర్చించి ఎప్పటిమాదిరి వాతాపిని సంహరించి అగస్త్యుడికి ఆహారంగా సమర్పిస్తాడు. ముగ్గురు రాజులు ముందుగా మునీంద్రునితో వీని యింటిలో భుజింప వద్దనీ, విత్తమిస్తే తీసుకొని వెడదామనీ రహస్యంగా విషయమంతా వివరించారు.

అగస్త్యుడు అణుమాత్రమైన చలించక అతడు పెట్టిన ఆహారాన్ని ఆరగిస్తాడు. మౌని ఆరగించిన వెనుక మునుపటిలాగా ఇల్వలుడు తమ్ముణ్ణి రమ్మని పిలుస్తాడు. అతడు పిలిచేలోపల తాపసి తన కడుపు తడువుకొంటూ గర్రున త్రేపుతాడు. వాతాపి ఆ క్షణంలోనే అగస్త్యుని బొజ్జలో జీర్ణమై పోతాడు.

ఇల్వలుడు మునిశక్తికి భయపడి ఏమీ జరగనట్లు ఎంతో ఉల్లాసం నటిస్తూ వినయపూర్వకంగా అతని రాకకు కారణమడుగుతాడు. అగస్త్యుడు కూడా ఏమీ ఎరగనట్లు కనిపిస్తూ 'నీ దగ్గర అపారధనరాసులున్నాయని తెలిసి ఈ రాజవరులతో ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్క భూపతికి పదివేల గోవులు, పదివేల గద్దెల బంగారం ఇవ్వు. అంతకు రెట్టింపు గోధనం, సువర్ణమయమైన రథం నాకివ్వు' అని అడుగుతాడు. ఆ విధంగానే ఇల్వలుడు సమర్పిస్తాడు.

అగస్త్యుడు ఆ ద్రవ్యంతో ఆశ్రమం చేరి లోపాముద్ర కోరిక తీర్చి 'దేవీ! నీకు పదిమందితో సమానులైన వేయిమంది పుత్రులు కావావా ? వెయ్యిమందితో ధీటైన ఒక్క కుమారునే కోరుకుంటావా? చెప్పు' అని అడుగుతాడు.

మహాసాధ్వియైన రాజపుత్రి పతిని చూసి 'ప్రాణేశ్వరా! తమవంటి వీర్యగుణ సంపన్నుడైన ఒక్క ఉత్తమ తనయునే కోరుతున్నాను.' అని అంటుంది.

లోపాముద్ర ఏడేళ్ళు గర్భం ధరించి దృఢదస్యుడనే సువుత్రుణ్ణి కంటుంది. దృఢదస్యునకు తేజస్వియైన ఇధ్మవాహుడనే కుమారుడు పుడతాడు. ఈ రీతి అగస్త్యుడు పుత్రపౌత్రవంతుడై తన పితరులకు పుణ్యగతులు కలిగిస్తాడు.

కన్నతల్లినీ, ఉన్న వూరునూ శాశ్వతంగా విడిచి పెట్టడం ఎంతటి త్యాగపురుషులకైనా శక్యం గాదు. ఇది పరోపకారపారీణుడూ, స్వార్థరహితూడా అయిన అగస్త్యునికే చెల్లింది.

మా యిద్దరిలో ఎవరు గొప్ప

అగస్త్యుడు లోపాముద్రతో వారణాసిలో విశ్వనాథుణ్ణి సేవిస్తూ గడుపుతున్న రోజులవి. నారదభగవానుడు తీర్థయాత్రలు చేస్తూ వింధ్యపర్వతం దగ్గరకు వస్తాడు. వింధ్యాచలం అతడికి ఎదురేగి అర్ఘ్యపాద్యములిచ్చి ఆదరించి చేతులు జోడించి 'మహానుభావా! మీ దర్శనం వల్ల నా జన్మ చరితార్థమయింది. సర్వపర్వతకులంలో మాన్యుడనయ్యాను, ధన్యణ్ణాయ్యను.' ఒక్క విన్నపం.

'ఈ మహీమండలంలో మీరు చూడని గిరులు లేవు. మందర గంధమాదనాది పర్వతాలు ఒకపాటివి. ఇక చిరుకొండల మాట చెప్పనవసరం లేదు.ఒక్క మేరుగిరి మాత్రమే నాతో ప్రతిఘటించగలదు. మహర్షీ! కొన్నళ్లుగా ఆధిక్య విషయమై మా మధ్య రవరవలు చెలరేగుతున్నాయి. మా యిరువురి తారమమ్యం మీకు బాగా తెలుసు. మొగమాట పడక పక్షపాతం విడిచి మా యిద్దరిలో ఎవరు గొప్పో చెప్పిండి' అని అడుగుతుంది

నారదుడు కలహప్రియుడు కదా! లోకోపద్రవకారణమైనప్పటికీ ఆ కొండలు రెంటికి తగవు పెట్టి తమాషా చూడాలని అనుకుంటాడు. ఆయన ఒక్క క్షణమాగి వింధ్యగిరితో 'ఓ శైలమా! మాలో ఎవరెక్కువ అని నీ వడగినట్లే మేరునగం కూడా మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని నన్ను ప్రశ్నించింది'. నీ శక్తి నీకు, తనశక్తి మేరువుకూ తెలియదా? కావాలని మీరు నా బుద్ధిపాటవం పరీక్షిస్తున్నారు. నిజంగా మీ వుభయుల బలాబలాలు నాకు తెలీవు. కానీ మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మీ గర్వోక్తులు విని సహించలేక పోతున్నాను. వాస్తవం చెప్పవలసివస్తే మహిమలో మీ యిద్దరికంటే శ్రీశైల వేంకటాచాలాలు ఎంతో గొప్పవి. మీ మిడిసిపాటు వాటికి లేదు. అయ్యా, మాలాంటి తీర్థయాత్రాపరులకు మీ గొడవలతో ఏమి పని?  వెళ్ళివస్తాను.' అంటూ నారదు డక్కడనుండి నిష్క్రమించాడు.

దేవమునీంద్రుని పలుకులు ములుకలై వింధ్యగిరిని బాధిస్తాయి. అతనికి మేరుపర్వతంపై పగసాధించాలనే ఆరాటం అంతకంతకూ అధికమవుతుంది. అతడు తన మనస్సులో 'శత్రువును జయించని వాని జన్మ మొక జన్మమా? తనంతటి విరోధి ఒకడు తన కళ్ళముందు విర్రవీగుతంటే కంటికి నిద్రవస్తుందా? వంటకం రుచిస్తుందా?' అసలెవ్వరితోనూ కాలు దువ్వరాదు. .కాలు దువ్వినప్పుడు కసి తీర్చుకొనక వెనుకంజ వేయరాదు.

మేరుగిరి అదృష్టం తలుచుకుంటే నా గుండె భగ్గుమంటుంది. పగటిపూట భానుడు, రాత్రులందు చంద్రగ్రహతారకలు అతని చుట్టూ ప్రదక్షిణం చేయడమా? నీకీ కర్మ ఎందుకని ప్రశ్నిసేతం విధినియమం అంటాడు. మేరు విజృభణం కనులారా చూస్తూ ఎలా సహించడం? సూర్యచంద్రులు మేరుగిరికి ప్రహరి తిరుగకుండా నిరోధిస్తాను. గగనతలాన్ని ఆక్రమిస్తాను' అంటూ వింధ్యపర్వతం త్రివిక్రమ స్వరూపం ధరిస్తుంది.

వింధ్యపర్వతం అడ్డగించడం చేత రవితేరు ఆకాశమధ్యంలో అట్టే ఆగిపోతుంది. సూర్యచంద్రగమనాలు కట్టుబడిపోవడం వల్ల ఇది పగలు, ఇది రాత్రి అని భూలోక వాసులకు తెలియడంలేదు. వర్షాలు కురియవు. జగములు అంధకారబంధురాలైనాయి.

ఈ అకాల ప్రళయానికి దేవమునీంద్రులు తల్లడిల్లి బ్రహ్మలోకానికి పోయి పరమేష్ఠిని పలువిధాల స్తుతిస్తారు. బ్రహ్మదేవుడు మునీశ్వరులకు అగస్త్యుడిని ప్రార్థించమని చెబుతాడు.

బృహస్పతి, మునీశ్వరులూ కుంభసంభవుని కడకేగి 'మహాత్మా! మీ ప్రతాప ప్రభావాలూ, ఔదార్యమూ పొగడ తరమా? బ్రహ్మదేవుని ఆజ్ఞవల్ల మిమ్మొకటి కోరటానికి వచ్చాము. వింధ్యపర్వతం మేరువుతో పోటీపడి నక్షత్రగ్రహ తారాచక్రాన్ని చిక్కుపరిచింది. ఈ ఆపద బాపటానికి మీరే సమర్ధలని బ్రహ్మ పంపగా వచ్చాము.' అంటారు.

వాచస్పతి మాటలు విని అగస్త్య మునిపుంగవుడు  'మీరు నన్నింతగా వేడుకోవడం దేనికి? కార్యం చక్కదిద్దటానికి సర్వవిధాలా యత్నస్తాను. అన్నిటికీ మనపాలి కల్పవృక్షం విశ్వనాథుడున్నాడుగదా! మీరు నిశ్చింతగా మీ నివాసాలకు వెళ్ళండి' అని వారిని సాదరంగా వీడ్కొల్పుతాడు.

ఇంకా వుంది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

పాత పుస్తకాలు - డౌన్లోడ్ చేసుకోవటం - Digital Library of India

మొదట  Downloader-NEW ( Downloader-OLD )ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకు ముందే Downloader-OLD డౌన్లోడ్ చేసుకున్నట్లయితే  update(NEW) కోసం Update(12-09-10) click చెయ్యండి.  Unzip చెయ్యండి. runDM.bat file ని run చెయ్యండి. 'chandamama' option select చేయండి. 'Download Location' field లో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి like C:\ లేదా 'Browse' Button click చేసి  location select చేసుకోండి. 'Year','Month' select చేసుకొని 'download' button click చెయ్యండి. ఒక్కో పేజి download అయిన తర్వాత ఇది ఒకే pdf file గా కలుపుతుంది(with year-month name). -------------------------------------------  1st Picture లో 'Digital Library ' select చేసుకుంటే Digital Library of India నుంచి పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 'http://www.new.dli.ernet.in/'   లో పుస్తకం వెతికి URL తెచ్చుకొని, దాన్ని 'URL' field లో paste చేసి 'add to download ' button click చెయ్యండి. తర్వాత 'd...