ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి పుస్తకం నుంచి
ఒక సాహిత్యాభిమాని నాకు వ్రాసిన జాబులోని కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదాహరిస్తున్నాను.
"గౌరవ్యులగు ఫలానా వారికి -
అయ్యా,
'సమర్ధవంతం'గా కృషిచేస్తే మానవ 'మేధస్సు' సాధించలేని దేదీ లేదు. మిత్రులతో చేసిన చర్చల్లో నాకు 'సమైక్యత' కుదరలేదు."
ఆయన వాక్యాలలోని కొన్ని శబ్దాల పరిశుద్ధి నాకు సందేహాస్పదం అయింది.
గౌరవ్యులు - గౌరవార్హులు అని ఆయన ఉద్దేశమనుకుంటాను. ఇది ఉజ్జాయింపుగా తయారుచేసిన కృతక శబ్దం.
గురు శబ్దం మీద భావార్ధక ప్రత్యయం చేరిస్తే గౌరవం అవుతుంది. దీని మీద కొందరు 'ఆనీయ' అనే ప్రత్యయం చేర్చి 'గౌరవనీయం' అని వ్రాయడం మొదలుపెట్టారు. అది శాస్త్రీయం కాదు. సుబంత శబ్దానికి 'అనీయ' చేరదు. అది ధాతువుకు చేరవలసినది. 'మహ్' ధాతువు కనక దానికి అనీయ చేరితే మహనీయ అవుతుంది. అట్లాగే పూజనీయ, మాననీయ, ప్రార్ధనీయ, వంటి శబ్దాలు పుడతాయి. ఈ అర్థంలో గౌరవార్హులు, గౌరవాస్పదులు అనవలసి వుంటుంది. కావలిస్తే గౌరవనేయ అనవచ్చు. కొంచెం కొత్త అనిపించినా -
గౌరవ్యులు అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. గౌరవ శబ్దానికి వారుద్దేశించిన అర్థంలో య ప్రత్యయం రాదు.
ఆయన, బహుశః కౌరవ్య శబ్దం చూచి పొరబడి ఉంటారు.
'కురు' శబ్దానికి ఆ వంశంలో పుట్టినవాడు అన్న అర్థంలో 'అ' ప్రత్యయం(తద్ధిత) చేరి కౌరవ అవుతుంది. కురు దేశానికి రాజు అనే అర్థంలో 'య' ప్రత్యయం వచ్చి 'కౌరవ్య' అవుతుంది. కురు శబ్దం పోలికతో గురు శబ్దానికి కూడా య ప్రత్యయం చేర్చి గౌరవ్య అని తయారు చేసి ఉంటారు. తాము తలచిన అర్థం వస్తుందో రాదో చూడకుండానే -
సమర్థవంతం - సమర్థ అన్నది విశేషణం. దానిమీద వత్(మతుప్) చేర్చరు. ఇది ఎట్టి అపశబ్దమంటే, రమ్యవంతం, మధురవంతం, సుందరవంతం వంటిది. సమర్థంగా అంటేనే కోరిన అర్థం వస్తుంది. ఇక వత్ చేర్చడం భ్రాంతి మూలకం. కాని, దీని ప్రయోగం పండితులనే బుట్టలో వేసేటంతగా వ్యాపించింది. పాణినీయమూ, నిఘంటువులూ, దీనిని విశేషణంగానే భావించాయి.
మేధస్సు - మేథ అంటే బుద్ధి, తెలివి అని అర్థం. ఇది అకారాంతం. సకారాంతం కాదు. సు, దుస్, అనే ఉపసర్గలతో సమాసమైతే - సుమేథసుడు, దుర్మేథసుడు అని అవుతుంది. దీన్ని చూచి విడిగాకూడా సకారం తగిలించి వాడడం మొదలుపెట్టారు. అది అనాలోచితం.
సమైక్యత - ఏక శబ్దానికి భావార్థంలో య ప్రత్యయం చేరిస్తే ఐక్యం అవుతుంది. ఏకత్వం అనే అర్థం వస్తుంది. సమ అనవసరం. 'త, త్వ' అనేవి ప్రసిద్ధమైన భావార్ధకాలు. తెనుగులో 'తనం' వంటివి. తెల్ల+పు తెలుపు. దీనిపై తనం అనవసరం. తెలుపుదనం అనకూడదు.
'ఐక్య' అన్నదానిలోనే భావార్థకం ఉన్నదని తెలియక దానిపై మరల 'త' చేర్చడం తప్పు. అలాగే ప్రాముఖ్యత, ప్రావీణ్యత, ప్రాధాన్యత, వంటి తప్పు ప్రయోగాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి