ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేమన యోగసిద్ధి - మత ప్రచారము

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి 'వేమన' పుస్తకం నుంచి

సకల జగత్కారణమైన మూలవస్తువొకటి కలదని మన ప్రాచీనులు వేలకొలఁది యేండ్ల క్రిందనే గ్రహించిరి. దాని తత్త్వము నెఱిఁగిన పక్షమున, సృష్టియందలి సందేహములకెల్ల నందు ప్రత్యుత్తరములు లభించుననియు, బంధములన్నియు నుడుగుననియుఁ దలఁచిరి -

"భిద్యతే హృదయగ్రన్థి శ్చిద్యన్తే సర్వసంశయాః
క్షీయన్తే సర్వకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే"

అది సగుణమయినను నిర్గుణమైనను శూన్యమైనను దాని స్వరూపము ననుభవపూర్వకముగ నెఱుఁగక తీఱదని తేలినది. కాని దాని నెఱుఁగుట యెట్లు? మితమైన శక్తిగల కన్ను ముక్కు మొదలగు బహిరింద్రియములచే సాధ్యముగాదు. సాధ్యమైనచో అమితమైన ప్రభావముగల మనస్సను అంతరింద్రియముచేతనే కావలయును. కాని యీ మనస్సు చంచలమైనది. నిమేష కాలమైనను ఒకవిషయమును ధ్యానించు దార్ఢ్యములేనిది. దానికితోడు శరీరమందును సంసారమందును గలుగు వివిధావస్థలు దానిని ఒకచోట నిలువనీయవు. కావున మనస్సు ఈ దేహమునకును బహిస్సంసారమునకును లోబడక తనంతట అఖండముగా నిలిచి కార్యమును నిర్వహించు మార్గమొకటి వెదకవలసివచ్చెను. అదే యోగము -
"యదా పఞ్చావరిష్ఠన్తే జ్ఞానాని మనసాసహ
బుద్ధిశ్చన విచేష్టతి తామాహుః పరమాంగతిమ్,
తాంయోగమితి మన్యన్తే స్థిరామిన్ద్రియధారణామ్" - కఠోపనిషత్తు, ౨౧౦
(ఎప్పుడు పంచేంద్రియములు మనసుతోఁజేరి నిలుచునో, బుద్ధియల్లాడదో, అదియే పరమగతి; అట్టి యింద్రియధారణమే యోగమందురు.)

బ్రహ్మధ్యాన మావశ్యకమనియు, దానికి మనోనిగ్రహము దేహదండనమును చేయక తీఱదనియు నన్ని దేశములవారు నంగీకరించిరి. కాని, ఆ దేహమలోనిగ్రహ మార్గమును ఉపక్రమోపసంహారములతో సక్రమమైన శాస్త్రముగా నేర్పఱిచిన గౌరవము, నే నెఱింగినంతవఱకు, హిందువులకే చెల్లవలసియున్నది. దేహమును స్వాధీనపఱచుకొనవలయునని నానావిధముల దండించి,  మనసును బిగంబట్టి బహిరంగములనుండి విడఁదీసి, లోపలధ్యానమునకుఁ బూనుకొన్నప్పుడు, పై రెంటికిని కలుగు అనేక పరిణామములును, అనుభవములును చక్కఁగా గమనించి, అందుఁగలుగు అనిష్టఫలములు నివారించి, ప్రధానోద్దేశమగు పరబ్రహ్మానుభవమును సాధించుట కెన్ని పద్ధతులు గావలయునో, యవన్నియు ననుభవపూర్వకముగా యోగ శాస్త్రకారులు వ్రాసిరి.

యోగాభ్యాసుల మొదటి ధర్మము తమయందలి దుర్గుణములను వదలుట. యోగ్యత సంపాదించుటకు మొదలు అయోగ్యతను పోఁగొట్టుకొనవలయును గదా? దేహబలమునుసంపాదించుటకు మొదలు రోగములకు మందుదిన్నట్లు.

ఒకరిని హింసిపక, అసత్యమాడక, ఒకరి సొమ్ముదొంగిలింపక, ఇంద్రియలోలుఁడుగాక, తనకెంత ముఖ్యముగా కావలయునోయంతకన్న నెక్కువ దానమిచ్చినను గ్రహింపక యుండుట మొదటిమెట్టు. ఇదే యమ మందురు.

తరువాత పరిశుద్ధముగా నుండుట, సంతోషము, తపస్సు, వేదశాస్త్రములు చదువుట, భగవద్భక్తి - వీనిని సాధింతురు. ఇవి నియమ మనఁబడును.

ఇట్లు దేహమనస్సులు కొంతవఱకు పరిశుద్ధములైన తరువాత దేహమందిది వఱకున్న రోగములు నశించుటకును, క్రొత్తవి రాకుండుటకును శ్రమము, సహించు శక్తి గలుగుటకును కొంత వ్యాయామము చేయుదురు. వీని వాసవము లందురు.

ఇంతైనను దేహమున కెప్పుడును చలనమునిచ్చి తన్ములమున మనస్సును చలింపఁజేయు వస్తువొకటి గలదు. అది వాయువు. దానిని స్థిరముగా నిలుపనిది మనస్సు నిశ్చలము గానేరదు.
"చలేవాతే చలంచిత్తం నిశ్చలే నిశ్చలంభవేత్"
(గాలి కదలిన మనసు కదలును; అది నిలిచిన నిదినిలుచును)

కావున లోని యూపిరి బైటికిఁ బోనీయక, బైటియూపిరి లోనికి రానిక లోపలనే పట్టి నిలుపుట యావశ్యకము. దీనినే ప్రాణాయాయమమందురు. దీనిచే మనస్సు నావరించియున్నమాలిన్యములన్నియు నశించు నందురు.

తరువాత కన్ను, ముక్కు మొదలగు పంచేంద్రియములు తమకు విషయములైన, రూపము, వాసన, మొదలగు వానియెడఁ బోనీయక మనస్సేప్రక్కఁబోయిన నా ప్రక్క పరాధీనములై యుండునట్లు సాధింపవలయును. ఇదే ప్రత్యాహారము.

ఇవి యైదును బైటి సాధనములు.

ఇట్లు శరీరము స్వాధీనమై మనస్సునకు చాంచల్యము తగ్గినపుడు తమకిష్టమైన యే వస్తువునందైన మనసును నిలుపవలయును. ఇది ధారణ. అది తప్ప తక్కిన వృత్తులయందు మనసును పోనీయక నిలుపుట ధ్యానము.
ఈ రెంటియందును 'నేను, దీనిని, ధ్యానించుచున్నాను' అను ధ్యాత ధ్యేయము, ధ్యానము అను మూఁడు పదార్థములు గలవు. ఈ ధ్యానము ఇట్లే సాఁగనిచ్చినయెడల మనము ధ్యానము చేయు వస్తువు మాత్రము నిలిచి, నే ననుకర్త, ధ్యానమను క్రయ ఈ రెండును అంతరించును. దీనినే సమాధి యందురు. ఇదే అష్టాంగ యోగము.

ఈ సమాధి రెండు విధములు; సంప్రజ్ఞాతమని; అసంప్రజ్ఞాతమని. మొదటి దానిలోఁ గూర్చున్న యోగికి మొదలు ధ్యేయవస్తువుయొక్క స్థూలరూపము గోచరించి క్రమముగా దాని సూక్ష్మరూపముగూడ స్పష్టమగును. ఆ మూలప్రకృతి గోచరించినపుడు 'ఋతంబర' యను నొకవిధమైన ప్రజ్ఞ కలుగును. దానిచే యదార్థ జ్ఞానము గలిగి సందేహములన్నియు నివర్తించును. శ్రుతిప్రమాణముచేతను, అనుమాన ప్రమాణముచేతను గలుగుతెలివికన్న ఈ 'ఋతంబర' యను తెలివి గొప్పది. ప్రత్యక్షము, పరోక్షము, భూతము, వర్తమానము, భవిష్యత్తు అను భేదము లోక యన్ని విషయములును సాక్షాత్తుగా నిందుగోచరించును.
ఈ సంప్రజ్ఞాత సమాథిగూడ అభ్యాస బలముచే క్రమముగా నశించి అసంప్రజ్ఞతసమాధిగా మాఱును. ఆయవస్థలో ఆ మిగిలిన ధ్యేవస్తువు స్ఫూర్తియగుటగూడ నశించి కేవల నిర్మలజ్ఞనము మాత్రము శేషించియుండును. ఇదే కైవల్యావస్థ. ఇవి పాతంజలియోగశాస్త్రముచే గ్రహింపగల ముఖ్యవిషయములు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం ...