తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం
నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గానీ, ఒక చిన్న కథ చెప్పుకుంటారు, సంస్కృతసాహిత్యం చదువుకున్నవారు. ఈ సంగతయినా కథగా చెప్పుకోరు. పెద్ద చరిత్రాత్మకమయిన విషయంగా చెప్పుతారు. ఏది ఎలాగున్నా, అది విమర్శకులు వినవలసినదే. కాబట్టి మనవి చేస్తాను.
చెప్పుకొనే కథ
ధారా నగరమో, ఉజ్జయినీ నగరమో ఏదో నగరము. మహారాజుగారి కొలువుకూటం. పని ముగిసిపోయింది. సాయంకాలం ౪ గంటలవేళ(ఇప్పటి వాచీల ప్రకారం) అయింది. ఇద్దరు యువకవులు పని ఏమీ లేక పోవడం చేత అలా షికారు బయలుదేరారు. ఎక్కడికి? వేశ్యవాటికకు - అంటే భోగం వీధికి. దుష్టచింతతో కాదు. సౌందర్య పిపాసతో.
వేశ్యవాటికలు
ఆ రోజులలో వేశ్యవాటికలు అంటే యిప్పటి భోగం వీధులలాగా వుండేవి కావు. అప్పటి వేశ్యలూ యిప్పటి భోగంవాళ్ళలాగా వుండేవారు కారు. వేశ్యలు బాగా చదువులలోనూ, సంగీతంలోనూ, కళలలోనూ కౌశలం వున్నవారు. వేశ్య వాటికలకు పోవడం ఆ రోజులలో - ఎందుచేతనో యిప్పటంత హేయంగా వుండేది కాదు.
ఆ రోజులలో సాయంకాలం నాలుగు గంటలవేళకు ప్రతి యింటి వేశ్యా సంజస్నానం చేసి చక్కగా అలంకరించుకొని, తలవాలి దగ్గర - దారిని పోయినవారికి కనిపించీ కనిపించనట్టు - నిలబడి వుండేవారు. అదే ఆ రోజులలో ప్రకటన విధం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ విధానం వుంది.
ఇద్దరు యువకులు
అలాగా ఉన్న ఆ నగర వీధులలోనుంచి షికారు తిరిగిరావడానికి బయలుదేరిన ఇద్దరు యువకులూ - మరెవరో కారు. సుప్రసిద్ధులని పేరు పొందిన కాళిదాసుడన్నూ, దండిన్నీ అట. కాళిదాసు అయిదో శతాబ్దం వాడయినా, దండి ఆరో శతాబ్దం వాడయినా, ఈ కథలో వీరిద్దరు కలిసే ఉన్నారు. అలాగా ఆ భోగం వీధిలో కలిసే తిరుగుతున్నారు. ప్రతి గుమ్మం దగ్గర నిలిచి ఉన్న భోగం అమ్మాయిని చూచి ఏదో ఒక లోపం కనిపెడుతూనే ఉన్నారు. ఆకార సౌష్టవాలను గురించి ఏదో తమలో తాము విసుర్లు విసురుకుంటూ విమర్శనలు చేస్తూనే నడిచి పోతున్నారు.
షికారు ఆగింది
అలా నడుచుకుంటూ పోతున్న ఇద్దరి షికారుకీ ఎక్కడా అడ్డు తగలలేదు. కాని, ఒక్క యింటి గడపదగ్గర నిలిచి ఉన్న కాంతది అపూర్వ సౌందర్యం. అక్కడికి వచ్చేసరికి ఈ ఇద్దరు కవుల దృష్టి ఆ దివ్య విగ్రహం మీదికి పోయింది. ఇద్దరి మనసులనూ ఆ విగ్రహం ఆకర్షించే వుంటుంది - సందేహం లేదు. చేరెడేసి కళ్లతో ఆ కాంతగూడా వీరని చూచింది. చూపో అది మదనుడి తూపో చెప్పలేము గాని, తక్షణం దండి కాళిదాస్, నువ్వు కొంచెం వుండు. చూడు తమాషా చేస్తాను అని గబ గబా ఆ కాంత దగ్గరకు వెళ్లి
తూర్ణమానీయతాం చూర్ణం
పూర్ణచంద్ర నిభాననే
అని తన కవన శక్తి కనబరుస్తూ అన్నాడు. ఓ పూర్ణచంద్రుని వంటి ముఖము కల చినదానా, (తూర్ణం) వేగంగా ఇంత (చూర్ణం) సున్నం తెచ్చిపెట్టు అని కోరాడు. ఏదో సున్నం అర్జంటుగా కావలసి వచ్చిన వాడిలాగా - కన్యాశుల్కంలో పిల్లా అగ్గిపుల్ల అన్నట్టు అడిగాడు.
కాళిదా సూరుకుంటాడా?
దండి వెళ్ళి ఈ తమాషా చేస్తూ వుంటే, కాళిదాసు ఊరుకుంటాడా పాఠకులే చెప్పుతారు. ఊరుకునేవాడు కాడని. ఊరుకోలేదు గూడాను. ధాటీగా అడుగులు వేసుకుంటూ, దగ్గరకువెళ్ళి, మహా ఠీవితో,
పర్ణాని, స్వర్ణవర్ణాని,
కర్ణాం తాయత లోచనే.
అని తనకు కావలసిన దానిని తాను కోరాడు. పర్ణాని, ఆకులు ఎలాంటివో తెలుసునా? స్వర్ణవర్ణాని, బంగారు వన్నెకల తమలపాకులు గూడాను. ఓ కర్ణాంతాయతలోచనే, చెవుల నంటుకుంటూవున్న కళ్ళు కలదానా తెచ్చి పెట్టు అని కోరికను తెలియజేశాడు.
వేశ్య చేసిన పని
ఆ వేశ్య ఇద్దరి కోరికలూ విన్నది. ఇద్దరినీ చూచింది. చిరునవ్వు నవ్వుకుంటూ, అక్కడనుంచి కదలకుండానే దాసీని పిలిపించింది. ఆ దాసీకి కాళిదాసుని చూపిస్తూ ఈ కవిగారికి మంచి పండుటాకులు(కొందరు లేత ఆకులంటారు) తెచ్చి పెట్టు అని తరువాత దండిని చూపిస్తూ ఈ పండితుడు గారికి ఇంత సున్నుం ఇవ్వు అని ఆజ్ఞాపించింది. ఇది కథ. శ్లోకంతో గూడూ మనకు పారంపర్యంగా వస్తూవున్న కథ. కాళిదాసును కవిగాను, దండిని పండితుడుగాను ఆ భోగకాంత నిర్ణయించింది.
దీనిలో ఉన్న సమస్య
ఎలాగా అన్నదే సమస్య. ఈ యువకవులకూ ఆ భోగ కాంతకూ అంతకుముందు పరిచయం వేదు. ఒకరినొకరు ఎరిగినవారు కారు. కాబట్టి ఆ వేశ్య నిర్ణయానికి పూర్వ ఆధారాలు ఏవీలేవు అనే అనుకోవాలి. ఆ సాయంకాలం వారు తన దగ్గరకు వచ్చినప్పటి పరిస్థితులనుపట్టే, వారు చెప్పిన శ్లోక భాగాలను పట్టిమాత్రమే ఈ నిశ్చయానికి రావాలి. ఈ నిర్ణయం చాలసత్యం అని సాహిత్య చరిత్ర అంతా చాటుతూనే వుంది. కాని, ఆ వేశ్య ఏలాగ నిర్ణయించగలిగింది?
ఇద్దరు చెప్పిన శ్లోకభాగాలూ సమానంగానే వున్నాయి. వ్యత్యాసం ఏమీలేదు. దండి పూర్ణచంద్ర నిభాననే అని పిలిచాడు. కాళిదాసు కర్ణాంతాయత లోచనే అని సంబోధించాడు. ఆ పైని తూర్ణమానీయతాం చూర్ణం అని దండి సున్నం కావాలన్నాడు. పర్ణాని స్వర్ణపర్ణాని అని కాళిదాసు ఆకు లడిగాడు. ఒక సంబోధనం ఒక కోరిక. ఇద్దిరూ శ్లోకంలో చెప్పినది ఒక్కలాగే వుంది.
అయినా ఆ కాంత వీరిలో ఒకడు కవి అనీ, ఇంకొకడు పండితుడనీ నిర్ణయించింది. సాహసం అనక తప్పదు కదా! అంతేకాదు. మొదట ఆదర బాదరగా పోయి దారిచేసినవాడు దండి. మొదట అడిగినవాడు దండి అయినా, ఈ వేశ్య దండి సంగతి మొదట ఎత్తుకొనేలేదు. కాళిదాసుకు ఆకులు తెమ్మని దాసితో చెప్పిన తరువాత, దండికింత సున్నం పెట్టమని ఆజ్ఞాపించింది. ఇది మరీ ఘోరం అనక తప్పదు.
ఎలా నిర్ణయించింది
ఇంతగా సాహసించింది ఆ భోగకాంత. నిజంగా ఆశ్చర్యపడక తప్పదు. ఆ శ్లోక భాగలే మన దగ్గర చెప్పినట్టయితే, మనం ఆ నిర్ణయానికి రాలేమనే చెప్పాలి - సాహసం లేకనో - సాహిత్యం చాలకనో - ఆ నిర్ణయానికి రాలేము. ఇప్పుడు ఈ భోగం వారి అమ్మాయి సాహసించి తన తీర్పు చెప్పింది. ఏ కారణాలవల్ల అలాంటి తీర్పు ఇచ్చిందో ఎక్కడాలేదు. సారస్వతంలోనుగాని, చాటుకథలలోనుగాని, ఎక్కడా దొరకదు.
కాబట్టే, మనం స్వయంగా ఆలోచించాలి. ఈ కాంత ఎలా విమర్శించింది? ఆ శ్లోక భాగాలను బట్టి వారిలో వ్యత్యాసం ఏలాగా నిర్ధారణ చేసింది. ఆ వ్యత్యాసంలో ఏ విశేషంవల్ల కాళిదాసును కవి అన్నది, దండిని పండితుడనే భావించడం ఎందుకు? మొదట అడిగిన వాడికి చివరను పెట్టడం దేనికి?
సమాధానము
కోరికలో
ఈ కోరికలు యువకులు కిద్దరికిని వట్టి నెపములే. నిజముగ దండికి సున్నము లేక కాదు. కాళిదాసునకు ఆకులు చాలక కాదు. ఏదో ఒక నెపము మీద ఆ భోగ కాంతతో కొంత పరిచయము కలిగించుకొనుటకును, కొంత తడవు సమీపమున నుండి చూడ జాలుటకును వీరెత్తిన యెత్తుగాని ఇది మరియొకటికాదు. కావున, కోరికలు సమకూర్చుట కెంత ఆలస్యమయిన నంత మేలు. అట్టి కోరిక కోరుట ఉచితజ్ఞత యనిపించుకొనును గదా!
అయినను దండి తూర్ణం అన్నపదమును ప్రయోగించి తొందర ను సూచించెను. ఈ తొందర ఆ సన్నివేశమునకు అనుచితము. ఇంక కాళిదాసో యనిన, బంగారు రంగుగల ఆకులను కోరినవాడు. ఎన్నిటినో యెంచి యేరినగాని ఒక తాంబూలమునకు తగినన్ని స్వర్ణ వర్ణ పర్ణములు చిక్కవు. అన్ని చిక్కిన వెనుక వానిని తెచ్చినంతవరకు ఆ భోగకాంత సామీప్యమును, సంభాషణయు లభించును. ఊహకు సముచితమయిన పదములను ప్రయోగించిన కాళిదాసు సమయజ్ఞుడు.
అంతియేకాదు. దండి తూర్ణ శబ్దమును ప్రయోగించుటవలన, ఎట్టి సున్నముచో నయిను సంతృప్తిపడదగినవాడని తేటపడును. కాళిదాసుడట్టులగాక గుణవిశిష్టములయిన స్వర్ణ పర్ణములనే సంతసించగలడు. అనుభవ యోగ్యములను గుర్తించగల నేర్పు కాళిదాసులందు రూఢియగును. కావుననే ఆ భోగకాంత దండిని పండితునిగను, కాళిదాసుని కవిగను నిర్ణయించినదని చెప్పవచ్చును.
ఇక సంబోధనలో
అది సాయంసమయము; కానిచో అప్పటి వేశ్యవాటికాచారములను బట్టి భోగకాంతలు తలవాకిటను నిలిచి యుండరు. ఈ సమస్యలో అది నాలుగ యిదు గంటల వేళగా నిరూపితమయియే వుంది. ఆ సమయమున చూచిన ఒక యువతి దండికి పూర్ణచంద్రునిభాననగా కనబడినది. కాళిదాసునకు కర్ణాంతాయత లోచనగా కాన్పించినది. సాయంకాలమున, ఇంకనూ సూర్యడు దిక్చక్రము సమీపించక యున్నప్పుడు, ఒక ముఖము చంద్రుని వలె కన్పడుట రసాభాసము. సాధారణముగ నట్టి సమయమున నెట్టి యందమయిన ముఖమును చూచినను చంద్రుడు మనమునకు రాడు. అయినను, అది స్త్రీకి తగిన సంబోధనమే. గ్రంథములలోను ప్రయోగమును గల సంబోధనమే.
కాళిదాసుడట్లు చేయలేదు. ఆ భోగ కాంతను చూచినప్పుడు తన మనసు నాకర్షించిన ఆ విశాల నేత్రములనే సంబోధనలో నిమిడ్చెను . ఆకర్ణాంతాయతలోచనే అనెను చూచిన విషయమున గల ప్రాముఖ్యమును గుర్తించు సూక్ష్మజ్ఞత కలవాడే, దానికి తగిన పదములను ప్రయోగించు సామర్థ్యమున్నవాడే, కవినామమున కర్హుడు. గ్రంథస్థ పదములను ప్రస్తుతాప్రస్తుతములను తెలియజాలక ఉపయోగించు నతడు పండితుడే. కావుననే ఆ వెలజవరాలు దండిని పండితునిగ చేసెనని యనదగును.
చాలా చక్కటి వివరణతో సాగింది మీ వ్యాసం. చాల సంతోషం. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికానీ కాళిదాసు చెప్పినది
"పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాకీర్ణ లోచనే"
అంటే..
స్వర్ణ = బంగారపు
వర్ణాని = రంగుగల
పర్ణాని = ఆకులు కొరుతున్నాను(పర్ణం అంటే ఆకు అని, పర్ణాని అంటే ఆకులు కావలని తెలియజేయడం)
కర్ణాంత=చెవుల చివరలవరకు
ఆకీర్ణ = వ్యాపించివున్న
లోచనే = కన్నులుకలదానా.
ఇక్కడ సమస్య కవీ పండితుడని కాదు. ముందు అడిగిన తనకు సున్నం ఇవ్వకుండా వెనుక అడిగిన కాళిదాసుకు ముందుగా ఆకులను తెప్పించినందుకు దండి ప్రశ్నిస్తాడు.
దానికి ఆ వేశ్య, పెద్దలను మన్నించమని కోరి, ఎక్కువ పైకమిచ్చిన(ఇక్కడ కాళిదాసు ప్రయోగించిన అణా(ణ)లు - 5) వారికి ముందుగా సేవచేసి వృత్తి దర్మాన్ని పాఠించానని సమాదానమిస్తుంది.
నేను 8వ తరగతిలో చదువుకున్న "ఆంధ్రుల అణా అసలు చరిత్ర" పాఠం లో నాకు గుర్తున్నంత వరకు తెలియజేశాను.
మీ కారణంగా మా తెలుగు మాష్టారిని గుర్తు చెసుకున్నాను.
ఆ మహానుబావుడి దయవల్ల ఇది చెప్పగలిగాను. పూర్తిగా జ్ఞాపకం లేకపోవడం వల్ల తప్పులు చెప్పిఉంటే..మణ్ణించండి.
తస్మైశ్రీ గురవే నమః
I remember the same chapter from our telugu text book. Thanks to our telugu teacher I can recollect each and evry word from both the poems. As u said it was about th number of Anas in each poem tt she counted .
తొలగించండినమస్కారం సుదర్శన్ గారు,
రిప్లయితొలగించండిఈ వ్యాసం తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం లోనిది.
ఈ విశ్లేషణ అంతా వారిదే. 'కృష్ణుడి శిరస్సుని సత్యభామ తన్నిందా' వ్యాసం కూడా ఆ పుస్తకం లోనిదే. ఇవి నాకు చాలా ఇష్టం.
ఈ కథ చాలా రకాలుగా ఉండి ఉండవచ్చు.
కాని నా ఉద్దేశ్యంలో, అణాల వివరణ కన్నా కవి పండితుల సమస్య వల్లే ఈ కథ రక్తి కడుతుంది.
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యాన్నిమీరు చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు.
"పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాకీర్ణ లోచనే" మరియు "కర్ణాం తాయత లోచనే" ఈ రెండు సరియైన పాఠాలే అనుకుంటున్నాను.
మీ ఇద్దరి "సంభాషణం" చాల బాగా ఉన్నది. శ్రీ శన్ముఖన్ గారు అది శ్రీ తాపి ధర్మ రావు గారు వ్రాసారని మూలాన్ని ప్రస్తావిస్తే బాగా ఉంటుంది.
రిప్లయితొలగించండినమస్కారం కిరణ్ గారూ,
రిప్లయితొలగించండివ్యాసం క్రింద లేబుళ్ళ దగ్గర 'తాపీ' వారి పేరే వ్రాసాను కాని మొదలే వారి పేరు వ్రాయాల్సింది, ఇప్పుడు సరి చేస్తాను.
సుదర్శన్ గారూ, మీరు చెప్పిన అణాల విషయం కూడా తాపీ వారు పుస్తకం లో వ్రాసారు, నేను బ్లాగు లో వ్రాయటం మర్చిపోయాను. మీరు చెప్పిన అణాల ప్రస్తావన కూడా చేరుస్తాను. ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు.
You people are doing great service to Telugu. Thanks to you all! I wish many other people like me will be motivated on reading such Telugu blogs.
రిప్లయితొలగించండి